బాల్య వివాహానికి అధికారుల బ్రేక్

25 Jan, 2014 00:45 IST|Sakshi

వర్గల్, న్యూస్‌లైన్: పసితనపు ఛాయలు ఇంకా వసివాడలేదు.. ఆ బాలికకు పెళ్లంటే ఏంటో తెలియదు.. అయినా ఆ బాలిక తల్లిదండ్రులు, బంధువులు వివాహం చేసేందుకు ప్రయత్నించడంతో అధికారులు అప్రమత్తమై అడ్డుకున్నారు. బాల్య వివాహానికి బ్రేక్ వేశారు. కలకలం రేపిన ఈ సంఘటన శుక్రవారం వర్గల్ మండల కేంద్రంలో జరిగింది. పేదరికం సాకుతో చదువుకు బదులు తన కూతురిని పనిబాట పట్టించి నాడు బాల కార్మికురాలిగా మార్చిన తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి అధికారులు ఆ బాలికను కస్తూర్బా గురుకులంలో చేర్పించారు. నేడు అదే బాలికను భారం దించుకోవాలనే తపనతో తల్లిదండ్రులు పెళ్లి తంతు నడిపించే ప్రయత్నం చేశారు.వివరాల్లోకి వెలితే..
 వర్గల్‌కు చెందిన హుస్సేన్, గోరీబీ దంపతులు కూలి పని చేస్తూ కాలం గడుపుతున్నారు. ఆడపిల్ల భారం దించుకోవాలనే తపనతో వర్గల్ కస్తూర్బా గురుకులంలో ఆరో తరగతి చదువుతున్న తమ కుమార్తెకు కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌కు చెందిన ఖాజాతో వివాహ సంబంధం కుదుర్చుకున్నారు. శుక్రవారం వివాహం జరిపించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
 
 విషయం తెలిసిన స్థానిక గురుకుల అధికారి పరిస్థితిని జీసీడీఓ రమాదేవికి చేరవేసింది. ఆమె జిల్లా విద్యాధికారి రమేష్ దృష్టికి తీసుకెళ్లడంతో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వెంటనే గజ్వేల్ సీడీపీఓ విమల, తహశీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ కృష్ణన్, ఎంఈఓ సుఖేందర్, వర్గల్ కస్తూర్బా గురుకుల ప్రత్యేకాధికారిణి రాధిక, గౌరారం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ జగదీశ్వర్ ఉదయం పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న బాలిక ఇంటికి చేరుకున్నారు. పేదరికం కారణంగా తాము చందాలు పోగుచేసి కూతురి పెళ్లి జరుపుతున్నామని తల్లిదండ్రులు అధికారులకు వివరించారు. బాల్యవివాహం నేరమని అధికారులు వారికి నచ్చజెప్పి పెళ్లి ప్రయత్నం విరమింపజేశారు. బాలిక భవిష్యత్తు దృష్ట్యా సంగారెడ్డిలోని బాల సదనానికి (చిల్డ్రన్ హోం) తరలిస్తున్నట్లు ఈ సందర్భంగా గజ్వేల్  సీడీపీఓ విమల తెలిపారు. అందరూ బలవంతం చేస్తేనే పెళ్లికి ఒప్పుకున్నానని, తనకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని, చదువుకుంటానని బాలిక ఈ సందర్భంగా విలేకరులకు తెలిపింది.
 
 నాడు బాల కార్మికురాలిగా..
 వర్గల్ కస్తూర్బా గురుకులం ముందర కూలీ పని చేస్తూ గత సంవత్సరం సెప్టెంబర్ 25న బాల కార్మికురాలిగా జీసీడీఓ రమాదేవి దృష్టిలో పడింది. వెంటనే ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి అదే రోజున వర్గల్ గురుకులంలో ఆరో తరగతిలో ప్రవేశం కల్పించారు. తాజాగా బాల్య వివాహం నుంచి అధికారులు విముక్తి కలిగించారు.
 

>
మరిన్ని వార్తలు