మరో రగడ!

17 Dec, 2017 10:26 IST|Sakshi

ప్రశాంతతకు మారుపేరుగా చెప్పుకునే జిల్లాలో మరో రగడ ప్రారంభమైంది. వంశధార జలాశయం పనుల్లో భాగాంగా నిర్వాసిత గ్రామాలను తొలగిస్తుండడంతో.. నష్టపరిహారం అందలేదని ప్రజలు చేస్తున్న ఆందోళనలు కొలిక్కి రాకముందే పలాస మండలంలో నిర్మిస్తున్న ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పరిధిలోని నిర్వాసితులు రోడ్డెక్కారు. పరిహారం చెల్లించకుండానే ఇళ్లు, పాకలను తొలగించేందుకు సిద్ధమైన అధికారులను అడ్డుకున్నారు. తొలగింపు ప్రక్రియను విరమించుకోవాలని నినదించారు. వారితో వాగ్వాదానికి దిగారు.

కాశీబుగ్గ: ఆఫ్‌షోర్‌ నిర్వాసితులకు  నష్టపరిహారం అందజేసి సాగనంపాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని పలాస మండలం రేగులుపాడు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిహారం చెల్లించకుండా పాకలను, ఇళ్లను తొలగించాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మూడు మండలాల పరిధిలో నిర్మితమవుతున్న ఆఫ్‌షోర్‌ జలాశయం పూర్తయితే రేగులపాడు గ్రామస్తులు ముందుగా నష్టపోతున్నారు. నిర్వాసితులుగా మారనున్న వీరికి నయాపైసా కూడా ప్రభుత్వం ఇంతవరకూ చెల్లించలేదు. అయినా అధికారులు ఎలాంటి ఆలోచన చేయకుండా పాకలు, ఇళ్లను పొక్లయినర్లు, జేసీబీలతో తొలగించేందుకు శనివారం సిద్ధం కాడవంతో ప్రజలు ఆందోళన చెందారు.

 తొలగింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు వచ్చిన టెక్కలి ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు, కాంట్రాక్టర్‌ ధనుంజయరెడ్డితో తమ సమస్యను చెప్పుకోవడానికి ప్రయత్నించారు. అయితే వారు వెనక్కితగ్గకుండా పదికిపైగా పశువుల శాలలను తొలగించారు. ఉన్న వాటిని కూడా తొలగించేందుకు వివిధ మార్గాల్లో పొక్లయినర్లు, జేసీబీలను రప్పించడంతో ఆగ్రహించిన ప్రజలు వాటికి ఎదురుగా వెళ్లి అడ్డుకున్నారు. అధికారులు, కాంట్రాక్టర్‌తో వాగ్వాదానికి ప్రజలు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాహనాలను వెనక్కి పంపివేయాలని, లేకుంటే అడ్డంగా పడుకుంటామని, ప్రాణాలైనా బలియిస్తామని హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. పోలీసులను పిలిపించి కేసులు నమోదు చేయిస్తామని అధికారులు హెచ్చరించారని పీత గంగయ్య, బొమ్మాళి సవరయ్యలు ఆవేదన చెందారు.

పరిస్థితి ఇలా..
ఆఫ్‌షోర్‌ నిర్వాసిత గ్రామమైన రేగులపాడులో సుమారు 120 కుటుంబాలు, 430 మంది వరకూ జనాభా ఉంది. జలాశయం పనులు  ప్రారంభించినప్పటికీ ఇళ్లకు, పశువుల పాకలకు, చెట్లకు ఎలాంటి నష్టపరిహారం ఇంతవరకూ చెల్లించలేదు. గత కొన్ని నెలలుగా అధికారులు, కాంట్రాక్టర్లు గ్రామానికి వచ్చి సర్వేల పేరుతో హడావుడి చేస్తున్నారు తప్పితే నిర్వాసితుల గురించి పట్టించుకోలేదు. ఇళ్లకు పరిహారం ఇస్తామని, పశువుల శాలలకు ఎలాంటి పరిహారం ఇవ్వమని చెబుతూ అధికారులు వస్తున్నారు. ఈ క్రమంలోనే కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం పనులు జరగాలని భావించిన కాంట్రాక్టర్‌ అధికారుల సమక్షంలో శనివారం ఇళ్లు, పాకల తొలగింపు పనులకు పూనుకున్నారు. బొమ్మాళి చినబాబు, దాసరి ఉమ్మయ్య, పానిల వసంత్, ఐతి ఆదినారాయణ, ఫీత భైరాగి, అంబలి నారాయణకు చెందిన పాకలను తొలగించారు. దీంతో ఒక్క సారిగా గ్రామస్తులు తిరబడ్డారు. పరిహారం చెల్లించకుండా పాకలు తొలగించడం తగదని వాపోయారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. వారికి వ్యతిరేకరంగా నినాదాలు చేయడంతో తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

మూడు రోజుల్లో పరిహారం చెల్లిస్తాం
నిర్వాసితులకు మూడు రోజుల్లో నష్టపరిహాం నగదును వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తాం. ప్రస్తుతం బ్యాంకు పనులు తప్పిస్తే మొత్తం పూర్తయ్యాయి. ఈలోగా పనులకు ఆటంకం లేకుండా చేయాలని తాము ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారు. పునరావాస కాలనీని కూడా నిర్వాసితులు కోరుకున్న చోట ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం.
– ఎం.వెంకటేశ్వరరావు, ఆర్డీఓ, టెక్కలి

మరిన్ని వార్తలు