అనారోగ్యానికి  కేరాఫ్‌ ఆయిల్‌ ఫుడ్‌

4 May, 2018 11:12 IST|Sakshi

బోండాలు, బజ్జీలు, పకోడిలు తినకపోవడమే ఉత్తమం

ఎక్కువగా నూనె వినియోగించే వస్తువులకు దూరంగా ఉంటే మంచిది

వేసవిలో ఆహారపు  విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి

శ్రీకాకుళం రూరల్‌ : ఆహార పదార్థాల్లో కొద్దిగా నూనె కనిపించినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. గారెలు, బూరెలు, అరిసెలు, బోండాలు, బజ్జీలు వంటిì వాటిల్లో నూనె కారుతున్నా ఇష్టంగా తినేవారు. ఇది నాటి పరిస్థితి. కాలం మారింది. ఆహారపు అలవాటుల్లో మార్పు వచ్చింది. డైటింగ్‌ వంటి వాటివల్ల చాలా మంది నూనె వస్తువులు చూసిన వెంటనే మొహం చాటేస్తున్నారు. అయితే చిన్నారులు, యువత మాత్రం నూనెతో తయారీ చేసే పదార్థాలను ఇష్టంగా తింటున్నారు.

ఎండలు మండుతున్నా నూనెతో తయారీ అయ్యే వస్తువులను రుచి చూడాలన్నా ఆత్రుత పోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్‌ ఫుడ్‌ తినడం అంత మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 
శ్రీకాకుళం నగరం పరిధిలో సాయంత్రం అయితే చాలు ప్రధాన కూడళ్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా చిరు వ్యాపారులు వివిధ రకాల ఫాస్ట్‌ఫుడ్‌ జోరుగా విక్రయిస్తున్నారు. టిఫిన్‌లతో పాటు ఆయిల్‌తో తయారయ్యే సమోసాలు, బోండాలు, బజ్జీలు, వడలు, చికెన్‌ పకోడీలు వంటివి జోరుగా అమ్ముతున్నారు.

నాసిరకం నూనెలు వినియోగం

వ్యాపారులు నాణ్యమైన నూనెను వినియోగించకుండా తక్కువ ధరకు దొరికే నాసిరకం నూనెలను ఉపయోగిస్తున్నారు. ఒకరోజు వంటచేయగా మిగిలిపోయిన నూనెను మరుసటి రోజు, తర్వాత రోజు కూడా ఉపయోగిస్తున్నారు. దీనికారణంగా ఆయిల్‌ బాగా కాగి చిక్కదనం అవుతోంది. నిత్యం ఇదే ఆయిల్‌తో వివిధ రకాల వంటకాలు వండటం వల్ల వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు సూచిస్తున్నారు.

ఆరోగ్య సమస్యలు ఇలా..

 ఎండా కాలంలో నాసిరకమైన, పదేపదే మరిగించిన నూనెలతో తయారు చేసిన వంటలు తినడం వల్ల గొంతులో ఇన్‌ఫెక్షన్, ఉబ్బసం, కడుపు, ఛాతీలో మంట, ఎసిడిటీ, అధిక దాహం, ఆరాటం వంటి     సమస్యలు తలెత్తుతాయి. కాన్సర్‌ సోకేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కళ్లు తిరిగి పడిపోవడం, రక్తపోటు పెరగటం, గుండె కొట్టుకోవడంలో వివిధ మార్పులు,చోటు చేసుకుంటాయి. నూనె పదార్థాలు వల్ల శరీరంలో మరింత ఉష్ణోగ్రత పెరిగి నీరసం, వడదెబ్బకు దారితీస్తోంది. 

జీర్ణకోశ వ్యాధితో పాటు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువ. కడుపులో ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంది.ఆయిల్‌ ఫుడ్‌ తగ్గించాలి. వేసవి కాలంలో ఆయిల్‌ ఫుడ్‌ను ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యంగా ఉంటాం. రోడ్డుపక్కన అమ్మే పానీపూరి, ఫాస్ట్‌ఫుడ్స్, చపాతి, ఛాట్‌లతో పాటు ఇతరత్రా వాటికి దూరంగా ఉండటం మంచిది. వేసవిలో అంబలి, కొబ్బరి బొండాలు, బార్లీ, గ్లూకోజ్, నిమ్మరసాలు తీసుకుంటే చాలా మంచిది. 

– సూరజ్‌ పట్నాయక్, రిమ్స్‌ వైద్యులు, శ్రీకాకుళం  

మరిన్ని వార్తలు