రైతుల ఆందోళన!

26 Jun, 2019 10:49 IST|Sakshi

సాక్షి, పత్తికొండ(కర్నూలు) : సబ్సిడీ వేరుశనగ సరఫరా చేయడంలో ఆయిల్‌ఫెడ్‌ అధికారులు విఫలం అయ్యారు. వేరుశనగ కోసం రైతులు మంగళవారం పత్తికొండలో ఆందోళన నిర్వహించారు. ఇప్పటివరకు సరఫరా అయిన వేరుశనగ స్టాకు అయిపోవడంతో 5 రోజుల క్రితం పంపిణీ నిలిపివేశారు. స్టాకు వచ్చిన తర్వాత మళ్లీ పంపిణీ చేస్తామని వ్యవసాయ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతులు ప్రతిరోజు వ్యవసాయ కార్యాలయం చుట్టూ, గోడౌన్‌ చుట్టూ తిరుగుతున్నారు. స్టాకు లేక నిరాశతో వెనుతిరిగి వెళ్తున్నారు. మంగళవారం పత్తికొండ, తుగ్గలి మండలాల రైతులు స్థానిక ఏడీఏ కార్యాలయం వద్దకు వచ్చి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. పంపిణీ చేయలేమని అధికారులు చెప్పడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుపై అర్ధనగ్నంగా బైఠాయించి ఆందోళన చేపట్టారు. అరకొరగా పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారని, రైతులందరికీ వేరుశనగ పంపిణీ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. రైతులకు మద్దతుగా సీపీఐ, సీపీఎం రైతుసంఘం నాయకులు రంగారెడ్డి, రాజాసాహెబ్, సిద్దయ్య తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు