సమీక్షలతో సరి

25 Jan, 2015 01:08 IST|Sakshi
సమీక్షలతో సరి

గుంటూరు సిటీ :  రాష్ట్ర ఖజానా నిండుకున్న ప్రస్తుత తరుణంలో చేసేందుకు పనేమీ లేని పలు ప్రభుత్వ శాఖల్లో గృహనిర్మాణ శాఖ ఒకటి. గతేడాది కట్టిన ఇళ్లకే ఇంకా డబ్బులు చెల్లించని దారిద్య్రంలో ఉన్న ఈ శాఖ ఇప్పట్లో కొత్త ఇళ్ల ఊసెత్తే అవకాశమే కనిపించడం లేదు. 2014 ఎన్నికలకు ముందు నుంచే గృహనిర్మాణశాఖలో ఎక్కడి పనులక్కడే నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగులు కూడా ఉన్న ఫళంగా ఫైళ్లను అటకెక్కించి, గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నారు. వైఎస్సార్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌గృహకల్ప తదితరాలతో క్షణం తీరిక లేకుండా గడిపిన సిబ్బంది టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడు మాసాల కాలంలో కేవలం సమీక్షలకే పరిమితమయ్యారు.
 
కొత్త బడ్జెట్ విడుదలైతేనే మళ్లీ ఇళ్లు..
 సరిగ్గా 2014 మార్చి 24వ తేదీతో గృహ నిర్మాణశాఖకు సంబంధించిన అన్ని రకాల పేమెంట్స్ నిలిచిపోయాయి. ఆ తర్వాత ఇక తాము చేసేదేమీ లేక కంప్యూటర్లు షట్‌డౌన్ చేశామని స్వయంగా ఆ శాఖాధికారులే చెబుతున్నారు. అప్పటి నుంచి నయాపైసా నిధులు మంజూరు కాలేదనీ, మార్చిలో  కొత్త బడ్జెట్ రిలీజ్ అయితేనే మళ్లీ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి కనిపిస్తుందనీ అంటున్నారు.

అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటికి పలు నిర్మాణ దశల్లో ఉన్న గృహాలకు ఈ శాఖ రూ.15కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉంది. కొత్త బడ్జెట్‌లో దీనికి నిధులు కేటాయిచినా ముందు పాత బకాయిలు చెల్లిస్తే కానీ, కొత్తవి మంజూరు చేయలేని పరిస్థితి. ఈ లెక్కన 2015-16 సంవత్సరంలో పేదవాడి సొంతింటి కల తీరే సూచనలు దాదాపు లేనట్లేనని స్వయంగా అధికారిలే అంగీకరిస్తుండటం విశేషం.
 
ముందు నుంచి వెనక్కు సర్వే..
2014 మార్చి 24వ తేదీ నుంచి కూడా ఈ శాఖ ఉద్యోగులు ఖాళీగా ఉంటూ జీతాలు తీసుకుంటున్నారా? అంటే లేదనే చెప్పాలి. ఎన్నికలయ్యాక సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గృహ నిర్మాణాలపై సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు. అది కూడా జిల్లాలో ఇంకా ఎంత మంది ఇళ్లు లేని నిరుపేదలున్నారా.. అని కాదు.

గడచిన పదేళ్లలో.. అంటే టీడీపీ అధికారానికి దూరంగా ఉన్న కాలంలో ఎన్ని గృహాలు మంజూరయ్యాయి? వాటిలో అర్హులైన లబ్ధిదారులున్నారా?  అక్రమాలకు  తావుందా? అనే అంశాలపై 2014 నుంచి 2004 వరకు లెక్క తీసే పనిలో నిమగ్నమయ్యారు.
 
నో బడ్జెట్ - నో వర్క్
 బడ్జెట్ లేదు. పనులు లేవు. 2014 ఎన్నికలప్పుడు ఎక్కడైతే తమ శాఖ పనులు ఆగిపోయాయో ఇప్పుడూ అక్కడే ఆగి ఉన్నాయి. సీఎం ఆదేశాల మేరకు 2014 నుంచి 2004 వరకు జిల్లాలో జరిగిన గృహ నిర్మాణాలపై సమగ్రంగా సర్వే నిర్వహిస్తున్నాం. తద్వారా అన్ని నిర్మాణాల వివరాలను కంప్యూటరీకరించాలన్నదే ఉద్ధేశం.

జిల్లాలో ఇలా 2,49,122 గృహాలను సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటికి లక్షా 43వేల వరకు పూర్తి చేశాం. మిగిలినవి కూడా త్వరలోనే పూర్తి చేసి  వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తాం. జిల్లాలో కొత్త ఇళ్ల మంజూరుల వ్యవహారం మార్చిలో బడ్జెట్ కేటాయింపులను బట్టి ఉంటుంది.
 - గృహనిర్మాణశాఖ పీడీ సురేష్‌బాబు

సమీక్షలు, గృహనిర్మాణశాఖ, ఉద్యోగులు,  
Reviews, department of house costructions, employees
 

మరిన్ని వార్తలు