పొయ్యిలు సరే.. సిలెండర్లేవి?

22 Feb, 2014 00:53 IST|Sakshi
పొయ్యిలు సరే.. సిలెండర్లేవి?
  •     మంత్రి పర్యటనలో భాగంగా ‘దీపం’ మంజూరు
  •      వెంటనే కనెక్షన్లు స్వాధీనం
  •      గిరిజనుల ఆందోళనతో స్టౌలు పంపిణీ
  •      ఇప్పటికీ అందని గ్యాస్ సిలిండర్లు
  •  చింతపల్లి, న్యూస్‌లైన్ : దీపం పథకంలో భాగంగా గ్యాస్ పొయ్యిలు పంపిణీ చేసిన అధికారులు సిలిండర్లు ఇవ్వడం మరిచిపోయారు. దీనిపై   గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 11న మంత్రి బాలరాజు చింతపల్లి, జీకే వీధి మండలాల్లో పర్యటనలో భాగంగా గిరిజన సహకార సంస్థ అధికారులు సబ్సిడీతో దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్‌లు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జీకే వీధి, చింతపల్లి మండలాల్లో సుమారు 200 మంది తెల్ల రేషన్ కార్డుదారులకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయనున్నామని ప్రకటించారు.

    మంత్రి బాలరాజు చేతుల మీదుగా చాలా మంది గిరిజనులకు గ్యాస్ కనెక్షన్‌లు మంజూరు చేశారు. మంత్రి పర్యటన ముగిసిన మరుక్షణమే లబ్ధిదారుల నుంచి అధికారులు గ్యాస్‌లను  స్వాధీనం చేసుకున్నారు. ఇదేమని అడిగితే తెల్ల రేషన్‌కార్డుతో పాటు ఆధార్ కార్డు, దరఖాస్తు ఫారాలు, రూ.2,700 చెల్లిస్తే వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని, కనెక్షన్ మంజూరైన తర్వాత ఈ పథకం కింద గ్యాస్ పంపిణీ చేస్తామని అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో ఈ నెల 14న పలువురు మహిళలు చింతపల్లి జీసీసీ బ్రాంచి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.

    ఇదంతా ‘మంత్రి మెప్పు కోసమేనా’ శీర్షికతో ఈ నెల 15న సాక్షి దినపత్రికలో కథనం కూడా ప్రచురితమైంది. ఈ మేరకు దిగివచ్చిన అధికారులు గ్యాస్ పొయ్యిలను హుటాహుటిన అందజేసి చేతులు దులుపేసుకున్నారు. గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయకపోవడంతో గిరిజనులు మరోసారి ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారు. సిలిండర్లు లేకుండా పొయ్యిలు పంపిణీ చేయడం వల్ల ప్రయోజనమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పథకాన్ని పూర్తి స్థాయిలో వర్తింపజేయాలని కోరుతున్నారు.
     

మరిన్ని వార్తలు