ఇంటి కోసం మహాలక్ష్మి మళ్లీ దీక్ష

1 Aug, 2018 13:05 IST|Sakshi
బూరాడలో మళ్లీ దీక్ష చేస్తున్న మహాలక్ష్మి  

రేగిడి శ్రీకాకుళం : బూరాడ గ్రామానికి చెందిన దేవకివాడ మహాలక్ష్మి గ్రామంలో మంగళవారం మళ్లీ దీక్ష ప్రారంభించింది. జిల్లా కలెక్టర్‌ చొరవతో భూసమస్య పరిష్కారం అయినప్పటికీ మహాలక్ష్మి ఉండేందుకు గూడు లేకపోవడంతో ఇంటి కోసం దీక్షను మళ్లీ ప్రారంభించిందని కుమార్తె గేదెల కల్యాణి విలేకరులకు తెలిపారు. భూమి, ఇళ్లు కోసం గత నెల 11వ తేదీ నుంచి గ్రామంలో దీక్ష చేసినప్పటికీ గత నెల 17న ఈమె ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.

అక్కడ కూడా వైద్యాన్ని నిరాకరించి ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగించింది. ఈమె పరిస్థితి విషమించడంతో 22వ తేదీన రాత్రి శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్‌చేశారు. 30వ తేదీ రాత్రి డిశ్చార్జి చేశారని కుమార్తె తెలిపారు. తమ కుటుంబ సభ్యుల నుంచి రావాల్సిన భూమి కోసం దీక్ష చేస్తున్న విషయంపై జిల్లా కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి స్పందించి 1.55 ఎకరాలు భూమిని దేవకివాడ మహాలక్ష్మి పేరున ఆన్‌లైన్‌ చేయించి ఆమెకు పాస్‌పుస్తకాలు అందజేయాలని ఆదేశాలు జారీచేశారని కుమార్తె చెప్పారు. మిగిలిన 10.45 ఎకరాల భూమి కోర్టు పరిధిలో ఉందన్నారు. అధికారులు స్పందించి తక్షణమే తన తల్లి నివాసం ఉండేందుకు ఇల్లును అందజేస్తే దీక్ష విరమింపజేస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు