అందరూ చూస్తుండగానే మృత్యుఒడిలోకి...

16 Jul, 2020 10:53 IST|Sakshi
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సంజీవిని వాహనం వద్దే వృద్ధుడు మృతి చెందాడు

కరోనా వైరస్‌తో వృద్ధుడి మృతి

మరణానంతరం చేసిన పరీక్షలో పాజిటివ్‌

సంజీవిని వద్దే కుప్పకూలిన వైనం

కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు

పలువురిని కలచివేసిన సంఘటన

కరోనా పరీక్ష చేయకుండానే వైరస్‌ ఆ వృద్ధుడిని కబళించింది. అందురూ చూస్తుండగానే తీవ్రమైన దగ్గు, ఆయాసంతో కొన్ని క్షణాలు నరకయాతన పడి ప్రాణాలు విడిచాడు. కరోనా పరీక్ష చేసి స్వల్ప సమయంలోనే ఫలితాన్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంజీవిని వాహనం వద్దకు ఓ వృద్ధుడిని అతని కుటుంబీకులు తీసుకు వచ్చారు. పరీక్ష చేసేందుకు తమ వంతు వచ్చే లోపు అక్కడే వైరస్‌ తీవ్రతతో కుప్పకూలి కన్ను మూశాడు. అధికారులు అనుమానంతో ఆ వృద్ధుడి మృతదేహానికి కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌ వచ్చింది. కరోనాతో వృద్ధుడు మరణించాడని తెలిసి కుటుంబీకులే కాదు అక్కడ ఉన్న వైద్య, రెవెన్యూ, పోలీసుయంత్రాంగం ఒక్కసారిగాకంగారుపడ్డారు.  

అమలాపురం టౌన్‌:  అమలాపురం సమీపంలోని కొంకాపల్లికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి కరోనా పరీక్ష చేయించి.. ఒక వేళ ఆ వైరస్‌ సోకితే అత్యవసర వైద్యంతో నయం చేయిద్దామనుకున్న అతని కుటుంబీకులు ఆ ఇంటిపెద్ద మరణానికి చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆ వృద్ధుడిని కుటుంబీకులు అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి మంగళవారం తీసుకుని వెళ్లారు. అయితే ఆ రోజు అతడికి పరీక్ష చేయడం కుదరలేదు. తీవ్రమైన దగ్గు, జ్వరం, ఆయాసంతో బాధపడుతున్న వృద్ధుడిని కుటుంబీకులు ఈసురోమంటూ తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. అయితే 15 నిమిషాల్లో కరోనా పరీక్ష చేసి ఫలితాన్ని ఇచ్చే ఆధునాతన సాంతకేతిక పరిజ్ఞానంతోన సంజివీని వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సమాచారం ఆ కుటుంబీకుల్లో కొంత ఉపశమనం కలిగించింది. అమలాపురం ఎస్‌కేబీఆర్‌ కళాశాల వద్దకు మంగళవారం ఉదయం వచ్చిన ఆ సంజీవిని వాహనం వద్దకు వృద్ధుడిని ఉదయాన్నే తీసుకు వచ్చారు. ఇక కొద్దిసేపటిలో పరీక్ష చేస్తారనగా వృద్ధుడు తీవ్రమైన దగ్గు, ఆయాసంతో ఊగిపోతూ కుటుంబీకుల చేతుల్లోనే ప్రాణాలు విడిచాడు.

చనిపోయే ముందు కరోనా లక్షణాలతో తమ ఇంటి పెద్దపడ్డ నరక యాతన చూసి కుటుంబీకులు తల్లడిల్లిపోయారు. వృద్ధుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్ధపడ్డారు. అయితే అక్కడే విధుల్లో ఉన్న పట్టణ ఎస్సై ఎం.ఏసుబాబు, కొత్తపేట తహసీల్దార్‌ కిషోర్‌బాబు వృద్ధుడి మృతదేహానికి కరోనా పరీక్షలు చేయించారు. దీంతో అతనికి మరణం కరోనా వల్లే సంభవించిందని అధికారులు నిర్ధారించారు. సామాన్య కుటుంబానికి చెందిన ఈ వృద్ధుడు తన కొడుకు, కుమార్తెలకు పెళ్లిళ్లు చేసేసి కుటుంబ బాధ్యతలు పూర్తి చేసి తన భార్యతో జీవిస్తున్నాడు. ఏడు పదుల వయస్సు మీద పడ్డా ఇంకా తన కాళ్ల మీద తాను నిలబడి బతకాలన్న ఆత్మ విశ్వాసంతో ఓ కిరాణా దుకాణంలో పనిచేస్తూ బతుకు బండిని లాగుతున్నాడు. ఇంతలో కరోనా కబళించి కడతేర్చింది. ఆర్డీవో బీహెచ్‌ భవానీశంకర్, డీఎస్పీ షేక్‌ మాసూమ్‌ బాషా, మున్సిపల్‌ కమిషనర్‌ కేవీఆర్‌ఆర్‌ రాజు సంజీవిని వాహనం వద్ద పరిస్థితులను పర్యవేక్షిస్తున్న సమయంలోనే వృద్ధుడు కరోనా లక్షణాలతో బాధ పడుతూ ప్రాణాలు విడిచిన ఘటన ఆ అధికారులను కూడా కలచివేసింది. వృద్ధుడికి ఎవరి కాంటాక్ట్‌ వల్ల వైరస్‌ సోకిందో అధికారులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు