నేటి గాంధీ దుర్మరణం

10 Dec, 2018 11:29 IST|Sakshi
మృతి చెందిన గాంధీ వేషధారి

ఆయన పేరేమిటో..

ఆయన పేరేమిటో..ఊరేదో తెలియదు.. కానీ నేటి గాంధీగా అనంత వాసులందరికీ పరిచయం. నిత్యం ఏదో ఒక సెంటర్‌లో గాంధీ వేషధారణలో కనిపిస్తూ నేటి తరానికి గాంధీ చరిత్రను పరిచయం చేసిన ఆయన ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అయినవారెవరూ లేకపోవడంతో మృతదేహాన్ని సర్వజనాస్పత్రిలో ఉంచారు.

అనంతపురం న్యూసిటీ:  జాతిపిత మహాత్మాగాంధీని ప్రత్యక్షంగా చూసిన వాళ్లు చాలా అరుదు. కరెన్సీ నోట్లపైన, టీవీలు, పుస్తకాల్లో చూసి ఉంటాం.. యూట్యూబ్‌ల్లో చూసుకొని ఇతనే గాంధీ అని మురిసిపోతుంటాం. ‘గాంధీ’తాత ఎలా ఉంటాడని పిల్లలను ఎవరైనా అడిగితే.. ‘వస్త్రాలు తొడగకుండా..గోచీ కట్టుకొని, తలకు ‘గుండు’కొట్టించుకొని..కళ్లజోడు పెట్టుకొని..చేతిలో ఊతకర్ర పట్టుకొని..శరీరమంతా ‘సిల్వర్‌’ బూడిద రాసుకొని, మెడ నుంచి జంజం వేసుకొని ‘అనంత’ నగరంలోని ప్రధాన వీధులు, కూడళ్లలో కదలకుండా, మెదలకుండా అచ్చం విగ్రహంలా నిలబడి భిక్షాటన చేసే ‘తాత’ను చూపించేవారు. అటుగా వెళ్లేవారంతా ఈ ‘తాత’ను చూసి బాపూజీలానే ఉన్నాడని ‘నాటి గాంధీ’ పోలికలను గుర్తు చేసుకునేవారు. అవును నేటి గాంధీతాత ఇక మనకు కనిపించరు. నగర సమీపంలోని పంగల్‌రోడ్డు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆదివారం దుర్మరణం పాలయ్యాడు. గాంధీ వేషధారి ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవాడనేది తెలియరాలేదు. మృతదేహాన్ని సర్వజనాస్పత్రి మార్చురీలో ఉంచారు.

మరిన్ని వార్తలు