గుండెలు పిండే విషాదం

9 Mar, 2019 09:41 IST|Sakshi
మృతిచెందిన పట్టాభి

అనారోగ్యంతో ఆత్మహత్యకు ఒడిగట్టిన వైనం

అనారోగ్యంతో కుమిలిపోయాడు.. అప్పులు చేసి వైద్యం చేయించుకున్నా నయం కాకపోవడంతో మనస్తాపం చెందాడు.. బాధ భరించలేక బలవన్మరణమే శరణ్యమనుకున్నాడు.. అందుకే కత్తితో పొడుచుకొని 77 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్యను ఒంటరిని చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. రేగిడి మండలం సంకిలి గ్రామంలోఈ దుర్ఘటన జరిగింది.

శ్రీకాకుళం, రేగిడి: అప్పులు చేసి వైద్యం చేయించుకున్నా నయం కాకపోవడం, చివరకు శరీరం సహకరించక మంచానికే పరిమితమైన ఓ వృద్ధుడు కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల పరిధిలోని సంకిలి గ్రామానికి చెందిన ఇట్రాజు పట్టాభి (77)  గురువారం రాత్రి ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్సై కె.వెంకటేష్‌ వివరాల ప్రకారం.. కొన్ని నెలలుగా ఊపిరితిత్తుల సమస్యతోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పట్టాభి అప్పులు చేసి శస్త్రచికిత్సలు కూడా చేయించుకున్నాడు. చేపలవేట చేసి కుటుంబాన్ని పోషించుకుంటూ ఈయనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో మంచానికే పరిమితమయ్యాడు.

భర్త పడుతున్న బాధను చూసి భార్య గంగమ్మ నిస్సహాయ స్థితిలో ఉండిపోయేది. దీంతో మనస్తాపం చెందిన పట్టాభి చేపల కోసుకున్న కత్తితో కడుపులో పొడుచుకుని, గొంతు వద్ద కోసుకున్నాడు. దీంతో బాధ భరించలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చి బిగ్గరగా కేకలు వేయడంతో గ్రామస్తులు పరుగున వచ్చారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో స్థానికులు 108 ద్వారా పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించినా అక్కడి వైద్యులు కూడా మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్స్‌ చేశారు. ఈ మేరకు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోస్టుమార్గ్టం నిర్వహించి బంధువులకు మృతదేహం అప్పగించారు. మృతుడికి ఐదుగురు ఆడపిల్లలు ఉండగా, వీరందరికీ వివాహాలయ్యాయి. భార్య గంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు