ఇదేనా భరోసా..!

8 Nov, 2014 14:30 IST|Sakshi
ఇదేనా భరోసా..!

తాళ్లూరు:ఏళ్ల నుంచి పింఛన్ తీసుకుంటున్నారు.. పింఛన్ల పునః పరిశీలనలోనూ అర్హులుగా తేలారు. జన్మభూమి సభల్లో ఎన్టీఆర్ భరోసా పత్రాలూ అందుకున్నారు. ఆ నెల పింఛన్ కూడా తీసుకున్నారు. కానీ మరుసటి నెలకే జాబితాలో పేరు లేదు. అదేమిటంటే ఆధార్ నంబరు సరిగా నమోదు కాలేదని కొందరివి..వేలిముద్రలు సరిపోలేదని మరికొందరివి నిర్దాక్షిణ్యంగా తొలగించేశారు. ఏ ఆధారం లేని తమకు ఉన్న పింఛనూ తీసేశారు..ఇదెక్కడి అన్యాయమంటూ పింఛన్‌దారులు లబోదిబోమంటున్నారు. సర్కారు ఇస్తామన్న భరోసా ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.
 
 తాళ్లూరుకు చెందిన లోకిరెడ్డి సుబ్బారెడ్డి ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నాడు. ప్రైవేటుగా డిగ్రీ చేస్తున్నాడు. వికలాంగుడు కావడంతో రెండేళ్ల నుంచి పింఛన్ వస్తోంది. ఇటీవల సామాజిక పింఛన్ల తనిఖీలో అర్హుడిగా తేల్చారు. దీంతో బట్వాడా కోసం పోస్టుమాస్టర్ వద్దకు వెళ్లాడు. బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు సరిపోవడం లేదు..ఆధార్ నంబరు తప్పుగా నమోదైందని..దీంతో మీకు పింఛన్ ఇవ్వలేమని అధికారులు చెప్పారు. గత నెల రోజులుగా ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరిగి ఆధార్ నంబరు నమోదు చేసుకున్నాడు. అయినా రెండో నెలలో పింఛన్ రాలేదు. దీంతో ఏం చెయ్యాలో ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి.
 
 వీరే కాదు..ఇదే సమస్యలతో వందల మంది పింఛన్‌దారులు అర్హులై ఉండీ..పింఛన్ అందక నానా అవస్థలు పడుతున్నారు. ఆధార్ సక్రమంగా నమోదు కాక, బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు సరిపోక నియోజకవర్గంలో దాదాపు 1310 మంది పింఛన్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. వీరిలో అనేక మంది వృద్ధులు బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు కొనేందుకు పూర్తిగా పింఛన్ నగదుపైనే ఆధారపడుతున్నారు.
 
  దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 20,025 మంది పింఛన్లు పొందుతున్నారు. ఇందులో పింఛన్ల పునః పరిశీలనలో 3,726 పింఛన్లు రద్దయ్యాయి. ఆధార్ కార్డుల్లేక, వేలిముద్రలు సరిపోక మరో 1310 పింఛన్లు ఆగాయి. గతంలో బయోమెట్రిక్ విధానంలో వృద్ధుల వేలిముద్రలు నమోదు కాకపోతే..వారి బంధువులవి ఆన్‌లైన్‌లో నమోదు చేసేవారు. మళ్లీ నూతన పద్ధతి అంటూ ఈనెల పింఛన్లు ఆపేశారు.  పింఛన్లపై ప్రభుత్వం రోజుకో విధానం అవలంబిస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో తమకు జరిగిన అన్యాయంపై అడిగేందుకు సిద్ధమవుతున్న పింఛన్‌దారులను పోలీసులు అడ్డుకుంటున్నారని... ఇక న్యాయం ఎక్కడ జరుగుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు.   
 
 పింఛన్ పత్రాలు ఇవ్వడం ఎందుకు ?: కోటమ్మ
 
 ఐదేళ్ల నుంచి పింఛన్ తీసుకుంటున్నా. ఊళ్లో పంచాయతీ దగ్గర సభ పెట్టిన పింఛన్ భరోసా పత్రాలిచ్చారు. ఆ నెల పింఛన్ తీసుకున్నా. మాకు భూములున్నాయని ఎవరో చెప్పి పింఛన్ ఆపించేశారంట. మరి భరోసా పత్రాలివ్వడం ఎందుకు? మళ్లీ పింఛన్ తొలగించడం ఎందుకు? ఇటువంటి పత్రాలున్నా..పోయినా ఒక్కటే. మా లాంటి వారిని ఇబ్బంది పెడితే పుట్టగతులుండవు.

మరిన్ని వార్తలు