బామ్మ స్వాతంత్ర్యానికి ముందే పుట్టి.. ఇప్పటికీ..

13 Sep, 2019 13:35 IST|Sakshi
ఇంటి ముందు ముగ్గు వేస్తున్న బామ్మ

ఆమె పండు ముదుసలి.. మూడు తరాలను చూసింది.. పిల్లపాపలను ఇట్టే గుర్తుపట్టేస్తోంది.. ఆ కుటుంబంలో అందరికీ తలలో నాలుకల ఉంటోంది. ఏ శుభకార్యం జరిగినా బామ్మకు ఆహ్వానం ఉంటోంది. ఇప్పటికి ఇంటి పనులు ఆమె చేసుకుంటుంది. ఇంటి ముంగిట నీళ్లు చల్లి ముగ్గువేస్తోంది. ఆమె పోరంకి చెందిన కున్నేర్ల లక్ష్మీకాంతం. నిండునూరేళ్లు పూర్తి చేసుకుంది.  

సాక్షి, విజయవాడ, గుంటూరు : మండలంలోని పోరంకి గ్రామానికి చెందిన కున్నేర్ల లక్ష్మీకాంతం. ఆమె వయసు 100 సంవత్సరాలు. స్వాతంత్య్రం రాక ముందే పుట్టింది. భర్త వీరస్వామి వ్యవసాయం చేసేవారు. వీరికి నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భర్త 30 ఏళ్ల కిందట మృతి చెందాడు. అప్పటి నుంచి కుమారుడి వద్దే ఉంటోంది. 18 ఏళ్లకే ఓటు హక్కు వినియోగించుకున్నట్లు గుర్తుచేసుకుంది. రాజకీయ నాయకుల్లో పీవీ నరసింహారరావు అంటే అభిమానం అని చెబుతోంది. ఆమె ఆరోగ్యమే ఆమెకు కొండంత ధైర్యం,బలం. ఎవ్వరి సాయం లేకుండానే ఆమె రోజువారీ పనులు చేసుకోవటమే కాకుండా ఇంట్లో పనులు కూడా చేస్తోంది. తీరిక వేళల్లో పత్రికలు కూడా చదువుతోంది.

దినచర్య ఇలా...
ఉదయాన్నే ఐదు గంటలకు లేచి కల్లాపు చల్లి ఇంటి మందు ముగ్గు వేస్తోంది.ఇంట్లో అంట్లు కూడా కడుగుతుంది. ఉదయం తేలికపాటి టిఫిన్, మధ్యాహ్నం సాధారణ భోజనం, రాత్రి భోజనం తీసుకుంటోంది. టీవీ ప్రొగ్రామ్‌లు చూస్తూ కాలక్షేపం చేస్తోంది.   కళ్ల జోడుతో పనిలేకుండా చదువుతోంది.

రామకోటి రాసిన బామ్మ..
బామ్మకు భక్తి కూడా ఎక్కువగానే ఉంది. ఆమె రామకోటి రాసింది. శ్రీసాయిబాబా, శ్రీనారాయణ, శ్రీఆంజనేయ, శ్రీగాయత్రీ మంత్రం కూడా చదవటం, రాస్తుంది. ఆమె సాక్షితో ముచ్చటిస్తూ ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపింది. తాను ఎంతకాలం బతుకుతానో తెలియదు కాని అందరూ బాగుండాలని ఆమె ఆకాంక్షించింది. కుమారుడు వీరాంజనేయులు వద్ద ఉంటున్నానని తెలిపింది.  

మరిన్ని వార్తలు