‘లక్ష్మి’భూరి విరాళం

29 Jul, 2018 06:39 IST|Sakshi

రూ.1.50 కోట్ల విలువైన ఐదెకరాలు విరాళంగా ఇచ్చిన వృద్ధురాలు

3 ఆలయాలకు ఎకరం చొప్పున..

నమ్మకమైన నాలుగు కుటుంబాలకు రెండు.. 

 మరణాంతరం వీలునామా ప్రకారం దస్తావేజుల అప్పగింత

అమలాపురం టౌన్‌: భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో అనేక ఎకరాల భూములున్న వారు కూడా సెంటు భూమి విరాళంగా ఇచ్చేందుకు సవాలక్ష సార్లు ఆలోస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.1.50 కోట్ల విలువ జేసే ఐదు ఎకరాల వ్యవసాయ భూములను ఒక వృద్ధురాలు మూడు ఆలయాలకు ఒక ఎకరం చొప్పున విరాళంగా ఇస్తున్నట్టు వీలునామా రాసింది. మిగిలిన రెండు ఎకరాలను ఆమెను నమ్ముకున్న నాలుగు కుటుంబాలకు ఇచ్చేందుకు ఆమె నిర్ణయించారు. ఈ భూములు తన మరణాంతరం ఈ ఆలయాలకు, కుటుంబాలకు అప్పగించాలని ఆమె రాసుకున్న వీలునామా శనివారం కార్యరూపం దాల్చింది. ఆమె మరణించిన తర్వాత తన భూములను ఆలయాల సేవలకు రాసి ఇవ్వడంపై ఆ వృద్ధురాలి త్యాగాన్ని అందరూ కొనియాడారు. 

ఎవరు ఆమె..? 
అమలాపురం రూరల్‌ మండలం జనుపల్లె గ్రామానికి చెందిన ఈరంకి లక్ష్మీ నరసమ్మకు 80 ఏళ్లు. కొన్నేళ్ల క్రితం ఆమె భర్త చనిపోయారు. వారసులు లేరు. తన పేరిట ఉన్న ఐదు ఎకరాలకు పైగా ఉన్న వ్యవసాయ భూములను గ్రామంలో నమ్మకంగా ఉండే కొలిశెట్టి గంగాధరం కుటుంబీకులకు కౌలుకు ఇచ్చింది. ఇటీవల ఆమె మృతి చెందింది. ఆమె రాసిన వీలునామాలను పరిశీలించగా జనుపల్లెలోని మదన గోపాల స్వామి, విశ్వేశ్వర స్వామి ఆలయాలకు.. అమలాపురంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఒక్కో ఎకరం భూమిని రాశారు. ఆమె వీలునామా ప్రకారం మూడు ఎకరాల మాగాణి భూములను ఆ ఆలయాలకు అప్పగించారు. 

ఇంతకాలం ఈ భూములను పర్యవేక్షించిన జనుపెల్లకు చెందిన కొలిశెట్టి గంగాధరం, లక్ష్మి దంపతులు, వారి కుమారుడు కొలిశెట్టి వెంకటేశ్వరరావు, వరలక్ష్మి దంపతులు.. ఈ భూముల దస్తావేజులను అమలాపురం వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావులకు శనివారం అందజేశారు. వాటిని ఆలయ చైర్మన్‌ కర్రి రామస్వామి (దత్తుడు), ఈఓ వీవీవీఎస్‌ఎన్‌ మూర్తిలకు, జనుపల్లె విశ్వేశ్వరస్వామి ఆలయ చైర్మన్‌ వేమన సూర్యనారాయణ, జనుపల్లె మదనగోపాల స్వామి ఆలయ చైర్మన్‌ వాకపల్లి వీరాస్వామిలకు వాటిని అప్పగించారు. మిగిలిన రెండు ఎకరాలను.. కొలిశెట్టి కుటుంబీకులకు అర ఎకరం వంతున నాలుగు కుటుంబాలకు రాశారు.

మరిన్ని వార్తలు