ఆస్తి ఉన్నా భిక్షాటన.. కొడుకులున్నా అనాథ

25 Feb, 2014 05:13 IST|Sakshi
ఆస్తి ఉన్నా భిక్షాటన.. కొడుకులున్నా అనాథ

‘‘నాయనా.. నా మొగుడు చనిపోయాడు. మాకు కోటి రూపాయల ఆస్తి ఉంది. ఇద్దరు కొడుకులున్నారు. వాళ్లు నన్ను ఇంటి నుంచి గెంటేశారు.. ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ అడుక్కు తిని బతకతాండా.. న్యాయం చే యండి స్వామీ అని మూడేళ్లుగా తిరగతాండా.. ఎవ్వరూ పట్టిచుకోవడం లేదు’’ అంటూ ఓ వృద్ధురాలు కన్నీళ్లు పెట్టుకుంది. తనకు న్యాయం చేయాలంటూ తిరుపతి ఆర్డీవోను వేడుకుంది.
 
 తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: రేణిగుంట మండలం వెదుళ్ల చెరువుకు చెందిన మంగమ్మ సోమవారం తిరుపతి ఆర్డీవో కార్యాలయానికి వచ్చింది. ఆర్డీవోకు తన మొర వినిపించింది. బాధితురాలి కథనం మేరకు.. రేణిగుంట మండలం వెదుళ్లచెరువుకు చెందిన మంగమ్మ(65), అయ్యప్పరెడ్డిది వ్యవసాయ కుటుంబం. వీరికి ఇద్దరు కొడుకులు. కోటి రూపాయల విలువ చేసే మూడెకరాల వ్యవసాయ పొలం, 200 గొర్రెలు, మంగమ్మకు 7సవర్ల బంగారు నగలు ఉన్నాయి. పెద్దకుమారుడు గురవయ్య, చిన్న కుమారుడు వెంకటమునికి పెళ్లిళ్లు చేశారు. వీరిది ఏ చీకూ చింతాలే ని కుటుంబం. పదేళ్ల క్రితం అయ్యప్పరెడ్డి చనిపోయాడు. దీంతో మంగమ్మ జీవితం తల్లకిందులై పోయింది. తండ్రి చనిపోయాక కొడుకులకు తల్లి భారంగా మారింది. ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టారు. ఉన్న నగలన్నీ లాక్కున్నారు. ఆమె మూడేళ్లగా గ్రామంలో అడుక్కుని తింటూ పొట్టపోసుకుంటోంది. పల్లెలోనే వేరే వారి గుడిసెలో తలదాచుకుంటోంది.
 
 కాళ్లరిగేలా తిరుగుతున్నా..
 తనకు న్యాయం చేయాలంటూ మంగమ్మ మూడేళ్లుగా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ, రేణిగుంట పోలీసుల వద్దకూ పోయింది. ఎవ్వరూ పట్టించుకోలేదు. అమె ఆర్డీవో కార్యాలయంలో సోమవారం కనిపిం చడంతో అక్కడున్న ఉద్యోగులందరూ ‘ఏమ్మా.... నీ సమస్య పరిష్కారం కాలేదా’ అంటూ నవ్వుతూ పోయారు. కొడుకులతో పాటు, తనను ఉద్యోగులూ చిన్నచూపు చూస్తున్నారని మంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తన సొత్తు తనకు వచ్చేలా చేస్తే ఆ దేవుడికి దానం చేస్తానంది. ఈ సందర్భంగా ఆర్డీవో రంగయ్య కాళ్ల మీద పడి తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది.
 
 కుమారులిద్దరికీ నోటిసులివ్వండి
 సొంత ఆస్తి, ఇల్లు ఉన్నా మంగమ్మను నానా ఇబ్బందులు పెడుతున్న కుమారులిద్దరికీ నోటీసులు ఇవ్వాలని అర్డీవో చెరుకూరి రంగయ్య ఆర్డీవో కార్యాలయ ఏవో సురేష్‌ను ఆదేశించారు. రెండురోజుల్లోగా వారిద్దరూ తన కార్యాలయానికి వచ్చేలా చూడాలని చెప్పారు.

మరిన్ని వార్తలు