ఆస్తి కోసం నా కుమారుడు ఇంట్లోంచి గెంటేశాడు

29 May, 2020 13:30 IST|Sakshi
బాధితురాలు సత్యవతిని విచారణ చేస్తున్న మహిళా కమిషన్‌ సభ్యురాలు రాజ్యలక్ష్మి

రాష్ట్ర మహిళా కమిషన్‌కు వృద్ధురాలి ఫిర్యాదు

విచారణ జరిపిన ఆ కమిషన్‌ సభ్యురాలు రాజ్యలక్ష్మి

తూర్పుగోదావరి, అమలాపురం టౌన్‌: ఆస్తి కోసం తనను కుమారుడు ఇంట్లోంచి గెంటేశాడని ఓ వృద్ధురాలు ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఆ కమిషన్‌ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి గురువారం అమలాపురం పట్టణం కొంకాపల్లిలోని తన చిన్న కూతురు ఇంటి వద్ద ఉన్న బాధితురాలిని కలిసి విచారణ చేశారు. వివరాల్లోకి వెళితే.. మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన 72 ఏళ్ల సత్యవతికి ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు.

గతంలోనే భర్త చనిపోయారు. ఆయన బతికి ఉండగానే పిల్లల పెళ్లిళ్లు, ఆస్తి పంపకాలు జరిగిపోయాయి. సత్యవతి జీవనాధారం కోసం ఆమె భర్త రెండు ఇళ్లు, ఐదు ఎకరాలు భూమి రాసి ఇచ్చారు. ఆ ఇంట్లోనే ఉంటూ వచ్చిన ఆదాయంతో జీవిస్తున్న ఆ తల్లిపై కుమారుడి నుంచి ఒత్తిడి మొదలైంది. ఇళ్లు, భూములు తన పేరున రాయాలని తల్లిని వేధించసాగాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. కాగా.. మహిళా కమిషన్‌ సభ్యురాలు రాజ్యలక్ష్మి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ బాధితురాలితో మాట్లాడారు. అమలాపురం డీఎస్పీ షేక్‌ మాసూమ్‌ బాషాతో కూడా ఈ విషయమై చర్చించారు. మలికిపురం పోలీసులతో కూడా మాట్లాడి బాధితురాలికి న్యాయం చేయాలని సూచించారు. తమ కమిషన్‌ తరఫున ఆ కుమారుడిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విచారణలో అమలాపురం, రాజోలు ఐసీడీఎస్‌ సీడీపీవోలు విమల, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు