స్త్రీవాద ఉద్యమ పతాక ఓల్గా

18 Dec, 2015 00:38 IST|Sakshi

ప్రముఖ రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
 
తెనాలి : ఓల్గా అసలు పేరు పోపూరి లలిత కుమారి. 1950 నవంబరు 27న గుంటూరు జిల్లాలోని యడ్లపాడులో జన్మించారు. ఆంధ్రా యూని వర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో ఎంఏ చేశారు. 1973 నుంచి 86 వరకు, ఆ తర్వాత కొంతకాలం తెనాలి లోని వీఎస్‌ఆర్ కాలేజీలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశారు. మార్క్సిస్టు భావజాలం, రష్యన్ సాహిత్యం, ఫెమినిస్టు రచయితలు కొడవటిగంటి కుటుంబరావు, చలం రచనలు అధ్యయనం చేశారు. వారి ప్రభావంతో ఫెమినిస్టు దృక్పథంతో స్త్రీవాదం, సాహిత్యం అంశాలపై ఓల్గా కలం పేరుతో పత్రికలకు వ్యాసాలు రాయటం ఆరంభించారు. చర్చా వేదికల్లో పాల్గొంటూ వచ్చారు.  చలం రచనలు చదవటమే కాదు, చివరి రోజుల్లో అన్నామలైలో ఉంటున్న చలంను ఆమె స్వయంగా కలుసుకున్నారు. అధ్యాపక వృత్తి తర్వాత హైదరాబాద్ వెళ్లి, ఉషాకిరణ్ మూవీస్‌లో స్క్రిప్టు విభాగంలో చేరారు. విమర్శల ప్రశంసలు, అవార్డులు పొందిన పలు సినిమాలకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు. తర్వాత ‘తోడు’, ‘పాతనగరంలో పసివాడు’ సినిమాలకు సహాయ దర్శకత్వం వహించారు.

కదంతొక్కిన కలం ...
అనంతరం ఆమె పూర్తిస్థాయి రచయిత్రిగా, హక్కుల కార్యకర్తగా ఉద్యమస్థాయిలో పనిచేయడం ఆరంభించారు. ఈ క్రమంలో ప్రముఖ ఫెమినిస్టు వాలంటరీ ఆర్గనైజేషన్ ‘అస్మిత ’లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. మరోవైపు ఆమె కలం కదం తొక్కింది. ‘స్వేచ్ఛ’, ‘సహజ’,  ‘మానవి’, ‘కన్నీటి కెరటాల వెన్నెల’, ‘గులాబీలు’ నవలలు రాశారు. చలం రచనల్లోని ఆరు స్త్రీ పాత్రలతో ‘వాళ్లు ఆరుగురు’ నాటకం రచించారు. ఆమె రాసిన కథలతో ‘రాజకీయ కథలు’, ‘ప్రయోగం’ వచ్చాయి. స్త్రీ దేహాన్ని కేంద్రంగా చేసుకొని ఆలోచించటం, రాజకీయం చేయడాన్ని ఈ కథలు ఎండగట్టాయి. ‘ఎవరైనా పురుష రచయిత ఒక ప్రేమకథ రాస్తే, ఎవరూ రంధ్రాన్వేషణ చేయరు...అదే ఒక రచయిత్రి రాస్తే, అది ఆమె సొంత ప్రేమకథేనా...? అందులో హీరో, ఆమె చుట్టూవున్న వ్యక్తుల్లో ఎవరయి ఉంటారు...అనుకుంటూ రచయిత్రి సొంత వ్యక్తిత్వాన్ని కించపరచేలా వ్యవహరిస్తారు’ అని ఓల్గా కుండబద్దలు కొడతారు. స్త్రీవాదం అంటే పురుష వ్యతిరేకం కాదనీ, పురుషుల మైండ్‌సెట్ మారాలనేదిగా చెబుతారు.  ఓల్గా రచించిన దాదాపు అన్ని రచనలు, అనువాదాలను  ది లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ సేకరించింది. ప్రస్తుతం ఆమె నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు సలహామండలి సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.
 
 ‘కేవలం ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళలకు స్వేచ్ఛ వచ్చినట్టు కాదు...చట్టసభల్లో మహిళలు విధాన నిర్ణయకర్తలు అయినపుడే అది సాధ్యపడుతుంది’ అని రచయిత్రి, స్త్రీవాద ఉద్యమకారిణి ఓల్గా స్పష్టంగా చెబుతారు. ఆమె రచించిన కథల సంపుటి  ‘విముక్త’కు గురువారం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది.
 
 విద్యార్థి ఉద్యమాల నుంచి మార్క్సిస్టు భావజాలం, విప్లవ రచనా ఉద్యమం ప్రభావం ఉన్నా, ఆయా ఉద్యమాల్లోని లింగ వివక్ష ధోరణిపై మౌనంగా ఉండలేదు. సమాజంలోని ద్వంద్వ నీతి, ఫెమినిస్టు ఉద్యమంపై విదేశీ ప్రభావాన్ని చూసి, తానే స్వతంత్రంగా మహిళల హక్కుల కోసం పోరాడాలన్న భావనతో కృషిచేస్తున్నారు.  ఫెమినిస్టు రచయిత్రిగా, మహిళా హక్కుల కార్యకర్తగా ఎదిగారు.
 

మరిన్ని వార్తలు