రేపు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రాక

14 Mar, 2015 00:55 IST|Sakshi

లబ్బీపేట : భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్‌కలాం ఆదివారం నగరానికి రానున్నారు. ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ పి.రమేష్‌బాబు గుంటూరులో ఏర్పాటుచేసిన 350 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించేందుకు వస్తున్న ఆయన తాడిగడపలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర వైద్య సంస్థను కూడా సందర్శించనున్నారు. కలాం ఇప్పటివరకు నగరానికి మూడుసార్లు వచ్చారు. 1998లో ఆయన పిన్నమనేని సీతాదేవి ఫౌండేషన్ అవార్డు తీసుకున్నారు.

తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు అందుకున్నారు. అప్పుడు ఆయన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీ వో) చీఫ్‌గా ఉన్నారు. అప్పట్లో చాలా సాదాసీదాగా ఒక డిఫెన్స్ కారులో ఎలాంటి  హడావుడి లేకుండా వచ్చి వెళ్లారు. 2006లో రాష్ట్రపతి హోదాలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్.ఆర్.ఐ. ఆస్పత్రి, సిరీస్ కంపెనీలను సందర్శించారు. మరోసారి  2008 ఏప్రిల్‌లో రామకృష్ణ మిషన్ విద్యాసంస్థలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. మళ్లీ ఏడేళ్ల తర్వాత కలాం నగరానికి రానున్నారు.
 
 

మరిన్ని వార్తలు