4న జేఈఈ మెయిన్ ఆఫ్‌లైన్ పరీక్ష

26 Mar, 2015 01:51 IST|Sakshi
  • 10, 11 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్షలు  
  • అరగంట ముందుగా పరీక్షకు అనుమతి
  • సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక జాతీయ ఇంజనీరింగ్ విద్యా సంస్థలైన ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్-2015 పరీక్ష టైం టేబుల్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) జారీ చేసింది. వచ్చే నెల 4న ఆఫ్‌లైన్, 10, 11 తేదీ ల్లో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పలు సూచనలు చేసింది. ఆఫ్‌లైన్ పరీక్షకు విద్యార్థులను అరగంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని తెలిపింది.

    ఉదయం 9:30 గంటలకు బీఈ/బీటెక్ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష పేపర్-1 ప్రారంభమవుతున్నందున విద్యార్థులను అరగంట ముందుగానే(9 గంటలకు) పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్/బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష పేపర్-2 ప్రారంభమవుతుందని, దీనికి అరగంట ముందుగానే (మధ్యాహ్నం 1:30 గంటలకు) పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని వెల్లడించింది. నిర్ణీత పరీక్ష సమయం తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

    తెలంగాణ నుంచి దాదాపు లక్ష మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 10, 11 తేదీల్లో జరిగే ఆన్‌లైన్ పరీక్ష ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అవుతుందని, విద్యార్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని తెలిపింది. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఏర్పాటు చేసే పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్ రాత పరీక్షతోపాటు ఆన్‌లైన్ పరీక్షలు ఉంటాయి. కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండలో ఆన్‌లైన్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తారు.

    ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కంచికచర్ల, కర్నూలు, నరసారావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఆన్‌లైన్ కేంద్రాలు, గుంటూరు, తిరుపతిలో ఆఫ్‌లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది.

మరిన్ని వార్తలు