కలెక్టర్ తీరుపై నిరసనోద్యమం

19 Aug, 2015 05:05 IST|Sakshi
కలెక్టర్ తీరుపై నిరసనోద్యమం

- చిత్తూరులో రెవెన్యూ ఉద్యోగుల భారీ ర్యాలీ, ధర్నా
- అనవసరంగా వేధిస్తున్నారని ఆరోపించిన రెవెన్యూ ఉద్యోగ సంఘ నేతలు
- సస్పెండ్ చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్
చిత్తూరు (గిరింపేట) :
జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ తమను వేధిస్తున్నారని నిరసిస్తూ జిల్లాలోని వేలాది మంది రెవెన్యూ ఉద్యోగులు మంగళవారం చిత్తూరులో ర్యాలీ నిర్వహించారు. గిరింపేట నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ సాగింది. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ నిరంతరం కష్టపడి ప్రజలకు సేవలందిస్తున్న తమ పట్ల కలెక్టర్ ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా ఉద్యమం చేస్తున్నట్లు చెప్పారు.

కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎటువంటి కారణం లేకుండా రెవెన్యూ ఉద్యోగులను వేధిస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు విజయసింహారెడ్డి మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన వలే కలెక్టర్ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమయపాలన లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు వీడియోకాన్ఫరెన్స్‌లు పెట్టి ఉద్యోగులను హింసిస్తున్నారన్నారు. డెప్యూటీ తహశీల్దార్లు నిర్మల, శకుంతల, జూనియర్ అసిస్టెంట్ లీలాకృష్ణారెడ్డిని అన్యాయంగా సస్పెండ్ చేశారన్నా రు. వీరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సత్యవేడు, పాకాల, గంగవరం సత్యనారాయణ నాయుడు,  కృష్ణయ్య,రమణిని బలవంతంగా సెలవులో పంపారని ఆరోపించారు.

రెవెన్యూ సిబ్బం దిని ప్రతి సోమవారం సాయంత్రం నుంచి రాత్రి 11 గంటల వరకు సమీక్షల పేరుతో వేధిస్తున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ ధోరణిపై రెవెన్యూ ఉద్యోగుల రాష్ట్ర నాయకులు మంగళవారం రెవెన్యూ మంత్రికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు జిల్లా అధ్యక్షుడు విజయసింహారెడ్డి తెలిపారు. తిరుపతి డివిజన్ అధ్యక్షుడు నరసింహులనాయుడు మాట్లాడుతూ సమావేశాల్లో కలెక్టర్ రెవెన్యూ ఉద్యోగుల పట్ల అవమానకరంగా మాట్లాడడం మానుకోవాలన్నారు. సస్పెన్షన్‌కు గురైన వీఆర్వో రామనారాయణను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నుంచి ఉత్తర్వులు అంది 110 రోజులు అయినా, ఇంతవరకు విధుల్లోకి తీసుకోకుండా కలెక్టర్ వేధిస్తున్నట్లు తెలిపా రు. చిత్తూరు డివిజన్ అధ్యక్షుడు రమేష్ పాల్గొన్నారు. వామపక్ష పార్టీల నాయకులు నాగరాజన్, రమణ, మధుకుమార్ తదితరులు మద్దతు తెలిపారు.

మరిన్ని వార్తలు