హామీల అమలు కోసం 5న ధర్నాలు

28 Nov, 2014 00:50 IST|Sakshi
హామీల అమలు కోసం 5న ధర్నాలు

ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రజల తరుపున పోరాటం చేసేందుకు తమ పార్టీ ఆధ్వర్యంలో వచ్చే నెల ఐదో తేదీన మండల పరిషత్‌లు, కలెక్టరేట్‌ల వద్ద ధర్నాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని పార్థసారథి, కొడాలి నాని తెలిపారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జరపనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్‌ను వారు ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక టీడీపీ నేతలు నానా తంటాలు పడుతున్నారని పార్థసారథి విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని విమర్శించారు. పెద ఓగిరాల, ఉయ్యూరులో పలువురు పేదల పింఛన్లను నిలుపుదల చేశారని వివరించారు. గతంలో మంజూరైన కృష్ణలంక కరకట్ట పనులను మంత్రి నిలుపుదల చేయించారన్నారు. మంత్రి దేవినేని ఉమా ఇసుక స్మగ్లింగ్ చేయిస్తున్నారన్నారు. మంత్రి తన ఇలాకా గ్రామాలైన గుడిమెట్ల, కాసరబాద నుంచి గుంటూరు జిల్లా తాడ్వాయ్‌కు వందలాది పడవలలో ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు. దీనిని అడ్డుకునేందుకు యత్నించిన అధికారులను కూడా మంత్రి బెదిరించి లొంగదీసుకున్నారని చెప్పారు.

రాజధాని పేరుతో టీడీపీ నేతలు వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపాదించుకున్నారన్నారు. విజయవాడలో రాజధాని పెడుతున్నట్లు ప్రచారం చేసిన టీడీపీ నేతలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించారన్నారు. వీరి మాటలు నమ్మి మధ్యతరగతి ప్రజలు మోసపోయి రియల్ ఎస్టేట్‌లో దిగి నిండా మునిగిపోయారన్నారు. తరువాత టీడీపీ నేతలు రాజధానిని గుంటూరు జిల్లాకు మళ్లించి అక్కడ  వ్యాపారం సాగిస్తున్నారన్నారు. మంత్రులు, వారి సొంత మనుషులు రియల్ మాఫీయాలో ఉన్నారని అయన అన్నారు. వారి మాటలు నమ్మి రైతులు, కౌలు రైతులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారని కొడాలి నాని పేర్కొన్నారు. టీడీపీ నేతలు ఎన్నికల్లో చేసిన హామీలను అమలు చేయాలని  తమ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతోందన్నారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. వాల్‌పోస్టర్ విడుదల కార్యక్రమంలో గన్నవరం మండల పార్టీ నాయకుడు మేచినేని వెంకట శివ సత్యనారాయణ (బాబు), అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు