వేతన యాతన

27 Sep, 2013 01:36 IST|Sakshi

విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఒకటో తారీఖు వస్తోంది... వెళుతోంది. కానీ ఉద్యోగుల జీవితాల్లో మార్పు రావడం లేదు. వారి ఖాతాల్లోకి నెల జీతం జమ కావడం లేదు. ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. కు టుంబం గడవడం కష్టంగా మారుతోంది. కానీ ఏ ఒక్కరిలో ఉద్యమ వేడి తగ్గలేదు. కడుపు కట్టుకొని సమైక్యాంధ్ర కోసం గట్టి సంకల్పంతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్క ఉద్యోగి జీతాలు రాకపోయినా రాష్ర్ట సమైక్యానికి ఉద్యమిస్తున్నారు.

రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత జిల్లాలో ప్రజా ఉద్యమం పెల్లుబికింది. దీంతో గత నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. కనీసం జీతాలకు బిల్లులు కూడా సమర్పించడం లేదు. ఫలితంగా గత నెల జీతం రాలేదు. కనీసం ఈ నెల అయినా వస్తుందంటే ఆ అవకాశం కూడా కనిపించడం లేదు. అక్టోబర్ 1న కూడా జీతాలు వచ్చే పరిస్థితి లేదు. వాస్తవానికి ప్రతి నెలా 23వ తేదీలోగా ఉద్యోగులు వారి జీతాల బిల్లులను ఖజానా శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. కానీ గడువు ముగిసినప్పటికీ ఉద్యోగులెవరూ బిల్లులను ఇవ్వలేదు. అలాగే ఖజానా అధికారులు, సిబ్బంది కూడా సమ్మెలో ఉన్నారు. దీంతో ఉద్యోగులకు జీతాలు వచ్చే అవకాశం లేదు.

 పండగ చేసుకొనేదెలా..

 పండగ మాసంలో కూడా ఉద్యోగులకు జీతాలు లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు అవస్థలు పడుతున్నారు. దసరా, దీపావళి పండగలను చేసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో దాదాపుగా 35 వేల మంది వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. వీరంతా  సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్నారు. గత నెలలో మాదిరిగా పోలీస్, జైలు, కోర్టు, ఫైర్, ఉన్నతాధికారులకు మాత్రం జీతాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన వారికి మాత్రం ఈ పండగలకు కష్టాలు తప్పవు.

 బ్యాంకుల చేయూత

 సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్న ఉద్యోగులకు బ్యాంకులు బాసటగా నిలవనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రుణాలు ఇవ్వడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. ఒకటిన్నర నెలల నికర జీతం మించకుండా ఓవర్ డ్రాఫ్ట్‌గా ఇవ్వడానికి ఎస్‌బీఐ మహారాణి పేట బ్రాంచి చీఫ్ మేనేజర్ అంగీకరించారు.

18.5 శాతం వడ్డీతో మంజూరు చేసే ఈ మొత్తాన్ని అయిదారు వాయిదాల్లో నెలవారీగా రికవరీ చేయనున్నారు. ఇది ఉద్యోగులకు కాస్త ఊరట కలిగించనుంది. ఉద్యోగులకు రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఎస్‌బీఐకి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు యు.కూర్మారావు కృతజ్ఞతలు తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు