మరోసారి బీపీఎస్

29 May, 2015 02:27 IST|Sakshi

అమలాపురం టౌన్ : నగరాలు, పట్టణాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరణ (బీపీఎస్) చేయించుకునేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. దీంతో నిర్మాణాల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకునేందుకు  భవన యజమానులకు వీలు కలగడంతో పాటు స్థానిక సంస్థలకు బోలెడు రాబడి రానుం ది.  1998, 2008 సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వాలు రెండుసార్లు అవకాశం ఇచ్చినా అక్రమ భవన నిర్మాణదారుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. తాజాగా ప్రభుత్వం మూడోసారి బీపీఎస్‌ను ఈనెల 27 నుంచి అమలు చేస్తోంది. జీవో నం:128తో మార్గదర్శకాలు, నిబంధనలు జారీ చేసింది.
 
 దీంతో జిల్లాలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మితమైన భవనాల యజమానులకు గుబులు కలుగుతోంది. క్రమబద్ధీకరణ ఒక రకంగా వారికి అవకాశమే అయినా  అందుకు నిర్ధారించిన ఫీజులు ఇప్పుడు తడిసి మోపెడై పెద్ద మొత్తాల్లో చెల్లించుకోవాల్సి వస్తుంది. మున్సిపాలిటీల అనుమతులు లేకుండా కొందరు, అనుమతి పొందినా అధికారికంగా ఇచ్చిన ప్లాన్‌కు విరుద్ధంగా కొందరు భవనాలను నిర్మించారు. అప్పట్లో ఫీజుల చెల్లింపు నుంచి వారు కొంత ఉపశమనం పొందినా మున్సిపాలిటీలు మాత్రం ఎంతో ఆదాయాన్ని కోల్పోయాయి.  
 
 రూ.50 కోట్లకు పైగా రాబడి
 జిల్లాలోని నగర, పుర పాలికల్లో దాదాపు 15 వేలకు పైగా అక్రమ కట్టడాలు ఉండవచ్చని అంచనా. రాజమండ్రి, కాకినాడ నగరాల్లోనే దాదాపు ఎనిమిది వేల అక్రమ కట్టడాలు ఉండవచ్చు. అమలాపురం, మండపేట, రామచంద్రపురం, తుని, పెద్దాపురం మున్సిపాలిటీల్లో దాదాపు నాలుగు వేల అక్రమ నిర్మాణాలు ఉంటాయని అంచనా. బీపీఎస్‌లో అక్రమ భవనాలకు విధించే అపరాధ రుసుం ద్వారా జిల్లాలోని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు రూ.50 కోట్లకు పైగానే ఆదాయం రావచ్చని సర్కారు ఆశిస్తోంది.
 
 
 ఇవీ నిబంధనలు
 =    బీపీఎస్‌ను సద్వినియోగం  చేసుకోవాలనుకునే అక్రమ నిర్మాణదారులు ఈనెల 27 నుంచి రానున్న 60 రోజుల్లో ఆన్‌లైన్ ద్వారా స్థానిక సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలి.
 =    దరఖాస్తుతో పాటు రూ.10 వేలు కనీస అపరాధ రుసుంగా చెల్లించాలి.
 =    మిగిలినది స్థానిక సంస్థలు తెలియజేసిన 30 రోజులలోపు చెల్లించి భవనాలను క్రమబద్ధీకరణ చేసుకోవాలి.
 =    ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే 30 రోజుల్లోపు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీకి అప్పీలు చేసుకోవాలి.
 =    100 చదరపు మీటర్ల లోపు స్థలాల్లోని నేల లేదా అంతస్తు వరకూ గల నిర్మాణం ఈ బీపీఎస్‌కు వర్తించదు.
 =    1985 జనవరి 1 నుంచి 201 డిసెంబరు 31 మధ్య కాలంలో నిర్మించిన అనధికార కట్టడాలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది.
 =    1997 డిసెంబరు 31 కంటే ముందుగా నిర్మించిన భవనాలపై 25 శాతం, నోటిఫైడ్ స్లమ్స్‌లోని నిర్మాణాలపై 50 శాతం అపరాధ రుసుంలో తగ్గింపు అవకాశం ఉంటుంది.
 =    దరఖాస్తుతో పాటు కనీస అపరాధ రుసుం, డిక్లరేషన్, గతంలో మంజూరు చేసిన ప్లాను (ఉంటే) భవనం తాలూకు ఫోటోలు, భవన యాజమాన్య పత్రం, ఇన్‌డెమ్నిటీ బ్యాండు, 3 జతల ప్లానుల స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ అందజేయాలి.
 =    అక్రమ లే అవుట్ల భవనాలు, ప్రభుత్వ స్థలాలు, రిజర్వుడు స్థలాలు తదితర అధికారిక స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలకు బీపీఎస్ వర్తించదు.
 

మరిన్ని వార్తలు