తగ్గని గోదా'వడి'

6 Aug, 2019 04:17 IST|Sakshi
వరదకు నీట మునిగిన దేవీపట్నం గ్రామం. (ఇన్‌సెట్‌లో) దేవీపట్నం మండలం పోసమ్మ గండి ఆలయం వద్ద నీటమునిగిన షెడ్లు

భద్రాచలం వద్ద నీటి మట్టం పెరగడంతో మరోసారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

మహాబలేశ్వర్‌ పర్వతాల్లో 38 సెంటీమీటర్ల భారీ వర్షం

పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు తృటిలో తప్పిన ప్రమాదం

గోదావరి ముంపు గ్రామాల్లో మంత్రుల పర్యటన

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: గోదావరిలో వరద ప్రవాహ తీవ్రత కొనసాగుతోంది. సోమవారం వేకువజామున 5 గంటలకు ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 13.70 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. క్రమేపీ తగ్గుతూ రాత్రి 7 గంటలకు 12.50 అడుగులకు చేరుకుంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు 100 టీఎంసీలను సముద్రంలోకి వదిలారు. గడచిన ఐదు రోజుల్లో 500 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. ధవళేశ్వరం, దాని దిగువ ప్రాంతాల్లో నీటిమట్టాలు తగ్గినా.. ఎగువన భద్రాచలం వద్ద పెరుగుతుండటంతో మరోసారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీని ప్రభావంతో మంగళవారం ధవళేశ్వరం వద్ద వరద తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ పరిస్థితి గోదావరి జిల్లాల ప్రజలను కలవరపెడుతోంది. ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు గోదావరిలోకి ఉప్పొంగి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సోమవారం సాయంత్రం 6.40 గంటలకు భద్రాచలంలో నీటిమట్టం 43 అడుగులకు చేరింది. తూర్పు గోదావరి జిల్లా చింతూరు వద్ద 37.6 మీటర్లు, కూనవరం వద్ద 37.32 మీటర్లు, పోలవరం వద్ద 27.2 మీటర్లకు చేరింది. పోలవరం కాఫర్‌ డాŠయ్‌మ్‌ వద్ద వరద నీటి మట్టం 27.2 మీటర్లకు చేరడంతో.. స్పిల్‌వే మీదుగా రెండు మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో 18 మండలాల పరిధిలోని 202 గ్రామాలను వరద ముంచెత్తింది. ఆ జిల్లాలో 87,850 మంది వరద వల్ల ఇబ్బందులు పడుతుండగా.. ఇప్పటివరకు 18,809 మందిని 85 పునరావాస కేంద్రాలకు తరలించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 22 మండలాల్లోని 218 గ్రామాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. 26,047 మందికి సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. తూర్పు ఏజెన్సీ, కోనసీమ లంక గ్రామాలు నాలుగు రోజులుగా ముంపులోనే ఉండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మామిడికుదురు, పి.గన్నవరం, అయినవిల్లి, ముమ్మిడివరం మండలాల పరిధిలో సుమారు 15 లంక గ్రామాలకు సైతం బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
 
ఎమ్మెల్యే, అధికారులకు తప్పిన ప్రమాదం
పోలవరం మండలంలోని ముంపు గ్రామాల ప్రజల యోగక్షేమాలు తెలుసుకునేందుకు వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు, అధికారులకు తృటిలో ప్రమాదం తప్పింది. వారు పోశమ్మగండి నుంచి టూరిజం బోటులో వెళ్తుండగా.. మూలపాడు వద్ద కొండపక్క వరద ప్రవాహంలో చిక్కుకున్న బోటు ఒక్కసారిగా ఊగిపోతూ నదిలో కిందకు దిగిపోయింది. బోటును నది మధ్య నుంచి వాడపల్లి వైపు మళ్లించటంతో ప్రమాదం తప్పింది. 

కమీషన్ల కక్కుర్తే కొంప ముంచింది
పోలవరం ప్రాజెక్ట్‌లో కమీషన్ల కోసం కక్కుర్తిపడి నిర్వాసితులను గాలికొదిలేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాల్లో వరదలకు కారణమయ్యారని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆక్షేపించారు. చంద్రబాబు పాపాలకు ప్రతిఫలమే ఈ వరదలన్నారు. కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం వల్లే వరదలు వచ్చిపడ్డాయన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ముంపుబారిన పడిన గిరిజన గ్రామాల్లో సోమవారం మంత్రుల బృందం పర్యటించింది. జల దిగ్బంధంలో చిక్కుకున్న వీరవరం గ్రామానికి ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఆళ్ల నాని,  మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నాగులాపల్లి ధనలక్ష్మి, యువజన అధ్యక్షుడు అనంతబాబు, కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి, ఎస్పీ నయీం అస్మి ట్రాక్టర్లపై వెళ్లి పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు.  మరోవైపు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆచంట మండలంలో ముంపుబారిన పడిన అనగారలంక, పెదమల్లంలంక, పల్లిపాలెం, అయోధ్యలంక, పుచ్చలంక, రాయిలంకల్లో అధికారులతో కలిసి పర్యటించారు. 1,684 కుటుంబాల వారికి ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కందిçపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పామాయిల్‌ పంపిణీ చేశారు.

శ్రీశైలం వద్ద పెరిగిన ప్రవాహం
శ్రీశైలం జలాశయంలోకి సోమవారం వరద ప్రవాహం మరింత పెరిగింది. సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి 2,36,331 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 42,378 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. హంద్రీ–నీవా ద్వారా 1,200 క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 863.8 అడుగుల మేర 118.05 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా విడుదల చేస్తున్న జలాల్లో 42,378 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌లోకి చేరుతున్నాయి. ప్రస్తుతం సాగర్‌లో 506.8 అడుగులతో 126.30 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మహాబలేశ్వర్‌ పర్వతాల్లో 38 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. దీంతో మూడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరించిన నేపథ్యంలో.. కర్ణాటక సర్కార్‌ ముందు జాగ్రత్తగా ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లో నీటి నిల్వలను ఖాళీ చేస్తూ భారీగా జలాలను దిగువకు విడుదల చేస్తోంది. కృష్ణా ప్రధాన ఉప నదులలో ఒకటైన బీమా ఉప్పొంగుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 1.60 లక్షల క్యూసెక్కుల వరద ఉజ్జయిని ప్రాజెక్ట్‌లోకి చేరుతోంది. ఉజ్జయిని గేట్లు అర్ధరాత్రి దాటాక ఎత్తే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు