ఆ నలుగురు.. మహా ముదుర్లు

2 Jun, 2017 09:22 IST|Sakshi
ఆ నలుగురు.. మహా ముదుర్లు

► మూడేళ్లుగా వరుస చోరీలు
► మొదటిసారి పోలీసు వలకు చిక్కి కటకటాలకు
► కేజిన్నర బంగారు, 30 కిలోల వెండి ఆభరణాలు రికవరీ


నలుగురు స్నేహితులు.. ఒక్కొక్కరిదీ ఒక్కో వృత్తి. పెయింటర్, కార్పెంటర్, ప్లంబర్, కూలీ పనులు చేసుకునే వారు. వచ్చే సంపాదనతో ఇల్లు గడవడం కష్టమైంది.  జల్సాకు డబ్బు సరిపోయేది కాదు. అడ్డ మార్గంలో డబ్బు సంపాదించాలని దొంగలుగా మారారు. తమ చేతి వాటాన్ని చూపుతూ రూ. అర కోటికి పైగా ఆభరణాలను అపహరించారు. వారికి అవసరమైనప్పుడల్లా దొంగలించిన ఆభరణాలను అమ్ముకుంటూ జల్సాలు చేసేవారు. ఎట్టకేలకు వారి ఆటకు సీసీఎస్‌ పోలీసులు అడ్డుకట్ట వేశారు. నలుగురిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు.

కర్నూలు: జిల్లాలో పలు చోరీల కేసులను దర్యాప్తు చేస్తున్న సీసీఎస్‌ పోలీసులకు పత్తికొండ చెందిన నలుగురిపై అనుమానం వచ్చింది. ఈ మేరకు పత్తికొండ పట్టణంలోని ఎస్వీ సుబ్బారెడ్డినగర్‌లో నివాసముంటున్న పింజరి అబ్దుల్లా, రెడ్డిబావి వీధిలో నివాసముంటున్న షేక్‌ షఫి అహమ్మద్, ముస్లిం వీధిలో నివాసముంటున్న పింజరి షేక్‌షావలి, అంబేద్కర్‌ సర్కిల్‌ దగ్గర నివాసముంటున్న సయ్యద్‌ చాంద్‌ బాషాలను  అదుపులోకి తీసుకుని విచారించగా నేరాల చిట్టా బయటపడింది. వారి వద్ద నుంచి రూ.54 లక్షల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని నిందితులను ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు.

అడిషనల్‌ ఎస్పీ షేక్‌షావలి, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీసీఎస్‌ డీఎస్పీ హుసేన్‌పీరాలతో కలసి గురువారం డీపీఓలోని వ్యాస్‌ ఆడిటోరియంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలను వెల్లడించారు. పింజరి అబ్దుల్లా మునాఫ్‌ పత్తికొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్లంబర్‌గా, షేక్‌ షఫీ అహ్మద్‌ పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన పింజరి షేక్‌షావలి పత్తికొండలో వివాహం చేసుకున్నాడు. అలాగే సయ్యద్‌ చాంద్‌ బాషా కార్పెంటర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. వచ్చే సంపాదన ఇల్లు గడవడానికే సరిపోయేది కాదు. వీరు నలుగురు స్నేహితులు. తరచూ మద్యం సేవించి జూదం ఆడేవారు. సంపాదన కోసం ముఠాగా ఏర్పడి నేరాల బాట పట్టారు.

మూడేళ్లుగా వరుస చోరీలు
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మూడేళ్లుగా వరుస చోరీలకు పాల్పడుతూ సొత్తును ఇళ్లల్లో భద్రపరచుకుని ఖర్చులకు అవసరమైనప్పుడల్లా విక్రయించేవారు. మొదట ఆత్మకూరు ప్రాంతంలోను, తర్వాత కర్నూలు, బళ్లారి ప్రాంతంలో కూడా చోరీలకు పాల్పడ్డారు. ఈనెల 31వ తేదీ నలుగురు కలసి కొన్ని ఆభరణాలను తెలిసిన వ్యక్తి ద్వారా బంగారు షాపులో అమ్మి సొమ్ము చేసుకునేందుకు వెళ్తుండగా పక్కా సమాచారం మేరకు సీసీఎస్‌ సీఐ లక్ష్మయ్య నేతృత్వంలో సిబ్బంది వలపన్ని పట్టుకున్నారు. విచారించగా ఇళ్లల్లో దాచి ఉంచిన సొమ్ముల వివరాలను వెల్లడించారు.

వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1,502 గ్రాముల బంగారు ఆభరణాలు, 30 కిలోల వెండి కలిపి రూ.54 లక్షలు విలువ చేసే సొత్తును రికవరీ చేశారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన సీసీఎస్‌ సీఐ లక్ష్మయ్య, ఎస్‌ఐలు శ్రీనివాసులు, రమేష్‌ బాబు, అశోక్‌కుమార్, నయాబ్‌ రసూల్, హెడ్‌ కానిస్టేబుళ్లు మస్తాన్‌ సాహెబ్, రుద్రగౌడు, వెంకటస్వామి, పీసీలు నాగరాజు, సుదర్శన్, నాగరాజు, రవికుమార్, కిషోర్, సమీర్‌ అహ్మద్‌లను ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించారు.
 
నేరాల చిట్టా ఇది
► 2014లో ఆత్మకూరుకు చెందిన రంగసాయి ఇంట్లో 207.627 గ్రాములు బంగారు ఆభరణాలను అహపరించారు.
► 2015లో కర్నూలు బి.క్యాంప్‌కు చెందిన వెంకటరాజు ఇంటికి కన్నం వేసి 26.100 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగలించారు.
► 2015లో బాలాజీనగర్‌లోని  షేక్‌ అబ్దుల్‌ రజాక్‌ ఇంట్లో 69.400 గ్రాముల బంగారు చోరీ చేశారు.
► 2015లో కర్నూలు ఇంజనీర్స్‌ కాలనీలోని రాంభూపాల్‌రెడ్డి ఇంట్లో 68.110 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ.
► 2017లో కర్నూలులోని మద్దూర్‌నగర్‌కు చెందిన రామాంజనేయులు ఇంట్లో 42.250 గ్రాముల బంగారు నగలు చోరీ.
► 2017లో కర్నూలులోని అబ్బాస్‌నగర్‌లో నివాసముంటున్న వెంకట్రామిరెడ్డి ఇంట్లో 35.100 గ్రాముల బంగారు నగలు చోరీ
► 2017లో కర్నూలులోని గాయత్రి ఎస్టేట్స్‌లో నివాసముంటున్న మురళీకృష్ణ ఇంట్లో 48.300 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ.
► 2017లో కర్నూలులోని దేవనగర్‌లో నివాసముంటున్న మీనా కుమారి ఇంట్లో 47 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ.
► 2017లో బళ్లారిలో వస్తువులు కొదువ పెట్టుకునే వ్యాపారి ఇంట్లో 1855.600 గ్రాముల బంగారు, 30.180 కిలోల వెండి చోరీ.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా