‘ఉపాధి’ శాఖలో వంద కోట్ల కుంభకోణం

23 Aug, 2016 01:13 IST|Sakshi

- జాయింట్ డెరైక్టర్, అసిస్టెంట్ డెరైక్టర్‌లకు సీబీఐ పిలుపు
- ఒకేషనల్ ట్రైనింగ్ పేరుతో దోపిడీ
- కేంద్ర నిధులు కావడంతో రంగంలోకి దిగిన సీబీఐ
 
 సాక్షి, అమరావతి : ఉపాధి కల్పన, శిక్షణ శాఖలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో కోట్లకు కోట్లు మింగినట్లు సీబీఐకి ఫిర్యాదులు అందాయి. దీంతో ైఉపాధి కల్పన, శిక్షణ శాఖ జాయింట్ డెరైక్టర్ జి మునివెంకటనారాయణ, అసిస్టెంట్ డెరైక్టర్ విటి తోడర్‌మల్‌లను సోమవారం హెదరాబాద్‌లోని కోటీ సెంటర్‌లో ఉన్న సీబీఐ కార్యాలయానికి పిలిపించి విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. భారత ప్రభుత్వం వివిధ విభాగాల్లో యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి వారికి వివిధ కంపెనీలు, ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు నిర్ణయించింది. శిక్షణ ఇచ్చిన సంస్థలు 70 శాతం మందికి ఉద్యోగాలు ఇప్పించాలి. ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా 600 కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించింది.

పలు స్వచ్ఛంద సంస్థలకు ఈ నిధులు కేటాయించి తద్వారా మంచి శిక్షణ ఇప్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే శిక్షణ ఇవ్వకుండా, కొన్ని చోట్ల పారిశ్రామిక కళాశాలల్లో శిక్షణ ఇచ్చినట్లు చూపించి కోట్ల నిధులు కాజేశారనేది ఆరోపణలున్నాయి. విజయవాడ కేంద్రంగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ 25 యూనిట్లు పెట్టి శిక్షణ  ఇచ్చినట్లు రికార్డులు తయారు చేశారు. నిజానికి ఆ స్థాయిలో ఇక్కడ కార్యక్రమం జరగటం లేదు. కొన్ని కాలేజీల వారికి కూడా ఈ శిక్షణ కార్యక్రమాలు అప్పగించినట్లు సమాచారం. పలు కంప్యూటర్ సెంటర్‌లు కూడా సంస్థలుగా రిజిస్ట్రేషన్‌లు చేసుకొని వారి వద్ద శిక్షణ పొందుతున్న విద్యార్థుల వివరాలు చూపించి రూ.కోట్లు కాజేసినట్లు సమాచారం. ఇదంతా జాయింట్ డెరైక్టర్, అసిస్టెంట్ ైడె రెక్టర్ కనుసన్నల్లో జరిగినట్లు తెలియడంతో సీబీఐ రంగంలోకి దిగింది.

 కేంద్ర ప్రభుత్వ నిధులు కావడంతోనే...
 భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1700 కోట్లు ఇచ్చింది. ఈ నిధులతో భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు భవన నిర్మాణరంగంతో పాటు వివిధ రంగాల్లో కూడా శిక్షణ ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ నిధులకు కూడా సరైన లెక్కలు లేవని తేలింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏపీఎంఈఎస్ పథకం కింద ఇచ్చిన ప్రత్యేక నిధుల్లో నుంచి రూ.వంద కోట్లకు పైన గోల్‌మాల్ చేసినట్లు సమాచారం. దీనిపైనే ప్రస్తుతం విచారణ మొదలైంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడవుతాయని ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటినీ పర్యవేక్షిస్తున్నది కార్మిక సంక్షేమ శాఖ డెరైక్టర్ వరప్రసాద్ కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు