ఒక్క రోజే గడువు

31 Mar, 2018 12:59 IST|Sakshi
దుకాణాల వద్దకు వెళ్లి పన్ను వసూలు చేస్తున్న మున్సిపల్‌ ఆర్‌ఓ, అధికారులు

పన్ను వసూలులోమొదటి స్థానం పులివెందుల, చివరి స్థానం రాయచోటి

గంట కొడుతున్నా స్పందించని బకాయిదారులు

జిల్లా వ్యాప్తంగా రూ.60.53 కోట్లకుగాను రూ.41.57 కోట్లు వసూలు

ప్రొద్దుటూరు టౌన్‌ :ప్రభుత్వం ఈ ఏడాది పన్ను వసూలుకు విధించిన గడువు శనివారంతో ముగియనుంది. వంద శాతం పన్ను బకాయిలు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసినా అమలు కాలేదు. పన్ను బకాయి ఉన్న వారి ఇళ్ల వద్దకు, వాణిజ్య సముదాయాల వద్దకు వెళ్లి గంటకొడుతున్నా, విద్యుత్, కుళాయి కనెక్షన్‌ తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. స్వయంగా మున్సిపల్‌ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు వసూళ్ల కోసం ఉదయం నుంచి రాత్రి వరకు కార్యాలయాలు వదలి రోడ్లపైనే ఉంటున్నారు. అయినా జిల్లాలోని ఏ మున్సిపాలిటీ వంద శాతం పన్ను వసూలు చేయాలేదు. మరొక్క రోజే గడువు ఉండటంతో రెవెన్యూ అధికారుల్లో ఆందోళన మొదలైంది. వసూళ్లలో వెనుకబడ్డ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారుల హెచ్చరికల నేపథ్యంలో బకాయిలు ఇచ్చేంత వరకు అధికారులు నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. శుక్రవారానికి పన్ను వసూళ్లలో మొదటి స్థానంలో పులివెందుల మున్సిపాలిటీ ఉండగా, చివరి స్థానంలో రాయచోటి మున్సిపాలిటీ నిలిచింది.

పేరుకుపోయిన ప్రభుత్వ బకాయిలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల బ కాయిలు కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు తలలు పట్టుకుం టున్నారు. ప్రొద్దుటూరు పట్టణం బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం నుంచి రూ.74లక్షలు బకాయి వసూలు కావాల్సి ఉంది. రెండు రోజుల క్రితం కమిషనర్‌ బండి శేషన్న, ఆర్‌ఓ మునికృష్ణారెడ్డి సిబ్బందితో వెళ్లి కార్యాలయం ముందు బైఠాయించి పన్ను చెల్లించాలని నిరసన వ్యక్తం చేసినా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈ విధంగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ పరిస్థితి ఉంది.

గత ఏడాది కంటేరూ.2కోట్లు అధికంగా వసూలు
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో రూ.14.82 కోట్లు ప్రైవేటు ఆస్తులపై, కుళాయి పన్ను వసూలు చేయాల్సి ఉంది. ఇందులో శుక్రవారానికి రూ.11.84 కోట్లు వసూలైంది. గత ఏడాదికంటే ఈ ఏడాది రూ.2కోట్లు అధికంగా వసూలు చేశాం. ప్రభుత్వ బకాయిలు రూ.1.80 కోట్లు ఉండగా రూ.18 లక్షలు మాత్రమే వసూలైంది. శనివారంలోగా 80 శా తానికిపైగా పన్ను వసూలు చేసేందుకు కృషి చేస్తాం.    – మునికృష్ణారెడ్డి,
    మున్సిపల్‌ ఆర్‌ఓ, ప్రొద్దుటూరు.

మరిన్ని వార్తలు