ఫ్యూజు వేయబోయి...

30 Sep, 2018 09:27 IST|Sakshi

యాడికి : వీరారెడ్డిపల్లెకు చెందిన పేరం శిరీష్‌రెడ్డి (25) పాలిటెక్నిక్‌ చదివాడు. తండ్రి అనారోగ్యంతో మృతి చెందాక తల్లి రాజేశ్వరికి చేదోడువాదోడుగా నిలిచాడు. తమకున్న పది ఎకరాల పొలంలో పత్తి, వేరుశనగ, మిరప, జొన్న సాగు చేసుకుంటూ జీవనం సాగించేవారు. శనివారం ఉదయం పత్తికి నీరు కట్టాలని తోటకు వెళ్లాడు. చుట్టుపక్కల మోటార్లు ఆడుతున్నా తమ పొలంలో ఆడకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకెళ్లి చూడగా ఫ్యూజు పోయినట్లు గుర్తించాడు. ఫ్యూజు వేసేక్రమంలో విద్యుదాఘాతానికి గురవడంతో అపస్మారకస్థితిలోకి చేరుకున్నాడు. పక్కతోటలోని రైతులు గమనించి శిరీష్‌రెడ్డి చిన్నాన్న కమలపాడు తాజా మాజీ సర్పంచ్‌ భీమేశ్వరరెడ్డికి సమాచారమందించారు. 

అనంతరం ఆటోలో యాడికి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే శిరీష్‌రెడ్డి మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ బొంబాయి రమేష్‌ నాయుడు, నాయకులు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి పంపించారు. అక్కడ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య, రమేష్‌రెడ్డి, విద్యార్థి విభాగం పట్టణ అద్యక్షుడు మనోజ్‌ తదితరులు వచ్చి శిరీష్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సాయంత్రం శిరీష్‌రెడ్డి మృతదేహం వీరారెడ్డిపల్లెకు తీసుకొచ్చారు. 

అంత్యక్రియల్లో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ వెంకటరామిరెడ్డి, నాయకులు యాడికి మాజీ ఉపసర్పంచు కాసా చంద్రమోహన్, మండల ప్రధాన కార్యదర్శి కోట చౌదరి, సేవాదళ్‌ కన్వీనర్‌ అవుకు నాగరాజు, సేవాదళ్‌ ఉపాధ్యక్షుడు రామ్మోహన్, బీసీసెల్‌ కన్వీనర్‌ మధురాజు, కోటి వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు