గేదెను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా

25 Nov, 2014 03:17 IST|Sakshi
గేదెను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా

* సికింద్రాబాద్‌వాసి మృతి
* మరో 10 మందికి గాయాలు

జగ్గయ్యపేట : గేదెను తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాకొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా, 10 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం పట్టణ సమీపంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఆర్టీసీ విజయవాడ ఆటోనగర్ డిపో సూపర్ లగ్జరీ బస్సు ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ బయలుదేరింది. బస్సు జాతీయ రహదారిలో వెంకట సాయి ఫుడ్ ప్లాజా వద్దకు వచ్చే సరికి ఓ గేదె అకస్మాత్తుగా అడ్డొచ్చింది. దీంతో డ్రైవర్ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు.

ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వెనుక సీటులో కూర్చున్న సికింద్రాబాద్‌కు చెందిన దేవిశెట్టి రవికుమార్ (47) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న సికింద్రాబాద్, విజయవాడ ప్రాంతాలకు చెందిన 10 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయప డ్డారు. తెల్లవారుజాము కావడంతో బస్సులో నుంచి ప్రయాణికులు బయటకు వచ్చేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పేట పట్టణ పోలీసులు, సమీపంలోని ఆర్టీసీ డిపో సిబ్బంది హుటాహుటిన వచ్చి గాయపడిన ప్రయాణికులను బయటకు తీసి 108 ద్వారా ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. ఎస్‌ఐ శ్రీను కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం అనంతరం కొందరు దొంగలు ప్రయాణికుల నగదు, విలువైన వస్తువులు దోచుకున్నారని తెలిసింది.

మరిన్ని వార్తలు