బన్నీ ఉత్సవంలో విషాదం

1 Oct, 2017 11:44 IST|Sakshi

కర్నూలు :
దసరా సందర్భంగా కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో శనివారం రాత్రి బన్నీ ఉత్సవం (కర్రల సమరం) జరిగింది. ఆలూరు సమీపంలోని దేవరగట్టు వద్ద జరిగిన ఈ సమరంలో సులువాయికి చెందిన ఈరన‍్న అనే వ‍్యక్తి మృతిచెందగా మరో 60 మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మాళ మల్లేశ్వరస్వామి ఆలయంలో దేవతామూర్తులైన మాళమ్మ, మల్లేశ్వరులకు విజయదశమి పర్వదినాన రాత్రి 12 గంటలకు కల్యాణం జరిపిస్తారు.

అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లోని పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురు బసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో విగ్రహాలను ఊరేగిస్తారు. ఈ ఉత్సవమూర్తులను దక్కించుకోవడానికి మూడు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. ఉత్సవం సందర్భంగా రక్తపాతం జరగకుండా చూసేందుకు దాదాపు 1200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అయినప్పటికీ కాగడాలు అంటుకుని ఒకరు మృతిచెందగా కర్రల దాడిలో  60 మంది గాయాలపాలయ్యారు.

మరిన్ని వార్తలు