ఒకరి కోసం ఒకరు..

13 Sep, 2015 04:26 IST|Sakshi

నాయనా భోజనం తిందువు లేరా...

‘‘నాయనా  లోహిత్ నేను ఉదయం పనికి వెళ్లినప్పుడు భోజనం పెట్టాను. మరి నేను ఇంటికి వచ్చాను  భోజనం పెడతాను లేరా నా కొడుకూ..’’ అంటూ బిడ్డ మృతదేహం వద్ద తల్లి కుసుమ రోదించడం అందరి హృదయాలను కలచి వేసింది.
 
విషాదానికే కన్నీళ్లు తెప్పించే ఘోరం.. కఠిన పాషాణమైనా విని కరిగి పోయేంత బాధ.. అయ్యో... ఎంతహృదయవిదార కం. తవణంపల్లె మండలం పోన్నేడు పల్లెలో శనివారం ఏనోట విన్నా.. ఏమనుసును కదిలించినా.. ఇదే వేదన. పుట్టినప్పటి నుంచి ఒక్కటిగా పెరిగిన ఆవూరి చిన్నారులు.. లోహిత్‌కుమార్, రాజ్‌కుమార్ మరణంలోనూ స్నేహబంధాన్ని విడువలేదు. తనకు ప్రమాదం తెలిసినా లోహిత్‌ను కాపాడేందుకు రాజ్‌కుమార్ నీటిలో దిగిపోరాడాడు. కానీ కనికరం లేని కసాయి నీటికుంట ఆ స్నేహితులిద్దరినీ పొట్టనపెట్టుకుంది. పైగా ఇద్దరు విద్యార్థులూ.. వారి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క మగ సంతానం కావడంతో పొన్నేడుపల్లె విషాదసంద్రంగా మారింది.
 
 
 తవణంపల్లె: తవణంపల్లె మండలం పొన్నేడుపల్లెలో శనివారం సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోనూ, స్కూల్లోనూ కలసిమెలసి ఉల్లాసంగా గడిపే ఇద్దరు మిత్రులు(విద్యార్థులు) నీటిగుంటలో పడి మృతి చెందడం అందరినీ తీవ్రంగా కలచివేసింది. కళ్లముందర తిరుతున్న పిల్లలు గంట గడిచే లోపే మృతి చెందడంతో  స్థానికులు కన్నీరుమున్నీరుగా ఏడ్చారు.

 పొన్నేడుపల్లెకు చెందిన ఎ.రవి,కుసుమలకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అదే విధంగా అదే గ్రామానిక చెందిన యూగమూర్తి,రాజేశ్వరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రవి కుమారుడు లోహిత్‌కుమార్(12), యాగమూర్తి కుమారుడు రాజ్‌కుమార్(12) ఇద్దరు చిన్నప్పటి నుంచి మిత్రులు. ఇద్దరు చిత్తూరులో 7వ తరగతి చదువుతున్నారు. శనివారం పాఠశాలకు సెలవు కావడంతో సాయంత్రం సరదాగా సైకిల్ తొక్కుతూ ఆడుకుంటున్నారు. అనపగుట్ట వద్ద ఇద్దరు మిత్రులు బహిర్భూమికి  వెళ్లారు. తర్వాత కాళ్లను శుభ్రం చేసుకోవడానికి లోహిత్‌కుమార్ ముందుగా హంద్రీనీవా కాలువలోకి వె ళ్లగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిగుంతలో పడ్డారు. లోహిత్‌కుమార్‌ను రక్షించడానికి రాజ్‌కుమార్ యత్నించాడు. ఈ క్రమంలో నీటిలో మునిగి ఇద్దరు మృత్యవాత పడ్డారు.
 
నాన్నా నాకు ఇక దిక్కు ఎవరూ...

 కుటుంబానికి దిక్కు నీవే అనుకుంటే నాకంటే ముందుగా వెళ్లిపోయావా నాన్నా.. ఇక నాకు దిక్కు ఎవరంటూ మృతుడు రాజేష్‌కుమార్ తండ్రి యూ గమూర్తి కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబానికి వారసుడని అంటే మా కు అందని దూరానికి వెళ్లిపోయావానాన్నా.. అంటూ దుక్కించడం చూపరులకు కంటతడి పెట్టించింది. తల్లి రాజేశ్వరి బిడ్డ మృతి సమాచారంతో అపస్మారక స్థితికి చేరుకుంది. తర్వాత ఆమెను అరగొండ అపోలో హాస్పిటల్ చేర్పించి  వైద్యం అందించారు.
 
 

>
మరిన్ని వార్తలు