విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి

24 Jul, 2015 01:58 IST|Sakshi

ఆమదాలవలస: ప్రభుత్వ విప్ కూన రవికుమార్ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా అది విద్యుత్ తీగలకు తగిలి షాక్‌తో ఒకరు చనిపోగా, మరొకరు గాయపడి శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ఆమదాలవలస కొత్తరోడ్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా సరదాపురం గ్రామానికి చెందిన బేసి భాస్కరరావు (40) కొత్తరోడ్ సమీపంలో వెల్డింగ్ దుకాణం నడుపుతూ.. గత రెండేళ్లుగా శ్రీకాకుళం పట్టణంలోని ఆదివారంపేటలో నివాసముంటున్నాడు.
 
 గురువారం ప్రభుత్వ విప్ రవికుమార్ విదేశీ పర్యటన ముగించుకొని వస్తున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపేందుకు, ఆహ్వానం పలికేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు ఫ్రేమ్‌లు తయారు చేసి వాటిని వేలాడ దీసేందుకు భాస్కరరావు కాంట్రాక్టును ఒప్పుకున్నాడు. వీటిని ఆమదాలవలస, శ్రీకాకుళం ప్రాంతాల్లో కట్టాడు. ఈ నేపథ్యంలోనే కొత్తరోడ్ సమీపంలో తన వెల్డింగ్ దుకాణం ఆవరణలోని శ్లాబ్‌పై పెద్ద ఫ్లెక్సీ కట్టేందుకు భాస్కరరావు ప్రయత్నించాడు. అయితే శ్లాబ్ పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలకు ఫ్లెక్సీ తగలడంతో దాన్ని పట్టుకొని ఉన్న భాస్కరరావు షాక్‌కు గురై  అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మృతునికి భార్య జయలక్ష్మి, కుమార్తె జాన్సీ, కుమారుడు మురళీమోహన్‌లు ఉన్నారు. కుటుంబ యజమాని మృతి చెందాడని తెలుసుకున్న భార్య పిల్లలు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరై విలపించారు.  
 
  సహాయం చేసేందుకని వెళ్లి గాయాలపాలు
 కొత్తరోడ్ సమీపంలో ఉన్న రైస్ మిల్‌లో పనిచేస్తున్న వంజంగి గ్రామానికి చెందిన చింతాడ నారాయణరావు ఫ్లెక్సీ కట్టడానికి సాయం చేసేందుకు వెళ్లి అతను కూడా విద్యుత్ షాక్‌కు గురై  శ్లాబ్ పైనుంచి కిందకు పడిపోవడంతో గాయపడ్డాడని స్థానిక పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ రామచంద్రరావు తెలిపారు. అతన్ని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
 
 మృతుడి కుటుంబానికి విప్ ఆర్థిక సాయం
 శ్రీకాకుళం :కొత్తరోడ్డు జంక్షన్ వద్ద ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన భాస్కరరావు కుటుంబానికి విప్ కూన రవికుమార్ లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించారు. శుక్రవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి వ్యక్తిగతంగా సహాయాన్ని అందించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ పరంగా సహాయం అందేలా చూస్తానని మృతుని కుటుంబానికి రవికుమార్ ఇప్పటికే హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు