విధి నిర్వహణకు వెళుతూ...

23 Oct, 2014 01:21 IST|Sakshi

ముమ్మిడివరం : విధినిర్వహణలో ఉన్న అగ్నిమాపక కేంద్రం ఉద్యోగి కొమానపల్లి సత్యం(55) బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ముమ్మిడివరం గంటావీధికి చెందిన సత్యం అమలాపురం ఫైర్ స్టేషన్‌లో డిప్యుటేషన్‌పై లీడింగ్ ఫైర్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అమలాపురం నుంచి కాకినాడ జిల్లా ఫైర్ ఆఫీసర్ కార్యాలయానికి రిపోర్టు చేసేందుకు వెళుతుండగా ముమ్మిడివరం నగర పంచాయతీ శివారు పల్లిపాలెం వద్ద 216 జాతీయ రహదారిపై ఎదురుగా కొబ్బరిలోడుతో వస్తున్న మినీవ్యాన్ అతడిని బలంగా ఢీకొట్టింది. ఈప్రమాదంలో  సత్యం తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సత్యానికి భార్య లక్ష్మి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 
 ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇటీవల ఉత్తరాంధ్రలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించేందుకు వెళ్లాడు. తిరిగి మంగళవారం ముమ్మిడివరం చేరుకున్నాడు. 1994 నుంచి 2002 వరకు ముమ్మిడివరం ఫైర్‌స్టేషన్‌లో ఫైర్‌మెన్‌గా పనిచేశాడు. స్వగ్రామం ఐ.పోలవరం మండలం కేశనకుర్రు అయినప్పటి కీముమ్మిడివరంలోనే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. తమకు పెద్ద దిక్కుకోల్పోయిన కుటుంబ సబ్యులు సంఘటన స్థలంలో కన్నీరుమున్నీరుగా విలపించారు. ముమ్మిడివరం ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ముమ్మిడివరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
 

మరిన్ని వార్తలు