స్నేహితుల దినం రోజే ..

4 Aug, 2014 03:41 IST|Sakshi

 ప్రొద్దుటూరుకు చెందిన విజయ్ కుమార్ స్నేహితులతో కలిసి సరదాగా గడపాలనుకున్నాడు. స్నేహితులంతా సమీపంలోని కుందూ నది వద్దకు వెళ్లారు. ఈత కొట్టసాగారు.. ఇంతలోనే విజయ్ కుమార్ ఊబిలో  చిక్కుకుపోయాడు. స్నేహితులు గమనించి వెలికితీసేలోపే ఊపిరి ఆగిపోయింది. స్నేహితుల రోజునే వారికి  విషాదాన్ని మిగిల్చాడు. ప్రొద్దుటూరు శ్రీనివాసనగర్‌కు చెందిన సుజానమ్మ, ఆనందరావు దంపతుల పెద్ద కుమారుడు విజయకుమార్(22) ఈత కోసం కామనూరు సమీపంలోని కుందూనది ఊబిలో చిక్కి ఆదివారం అకాల మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన ఈ ప్రాంతంలో విషాదాన్ని నింపింది.
 
 పనికెళ్లిన్నా.. బతికేటోడు
 విజయకుమార్ లారీ అన్‌లోడింగ్‌కు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేవాడు. ఆదివారం ఫ్రెండ్‌షిప్ డే కావడంతో పనికి వెళ్లలేకపోయాడు. తోటి మిత్రులతో కలసి ఆనందంగా గడపాలనుకున్నాడు. తన ఆరుగురు మిత్రులతో కలసి కామనూరు సమీపంలోని కుందూనదికి ఈతకని వెళ్లాడు. అక్కడ ఈతకొడుతుండగా ఊబిలో చిక్కాడు. ప్రమాదవశాత్తు అందులో చిక్కుకుని మరణించాడు.
 
 ఈతగాళ్లొచ్చినా
 ప్రయోజనం లేకపాయె..
 సంఘటన జరిగిన వెంటనే విజయకుమార్ మిత్రులు వెంటనే గ్రామంలోకి చేరుకుని జరిగిన సంఘటనను తెలిపారు. వెంటనే గ్రామస్తులు ఈతగాళ్లను పిలిపించారు. వారు కుందూనదిలో అంతటా గాలించారు. చివరకు విజయకుమార్ మృతదేహాన్ని బయటకు తీయగలిగారు.    
 
 విజయకుమార్‌కు నివాళులు
 ఈతకు వెళ్లి విజయకుమార్ మృత్యువాతపడినట్లు తెలియగానే వార్డు కౌన్సిలర్ రాగుల శాంతి, ఆమె భర్త శ్రీనివాసులు, 19వ వార్డు కౌన్సిలర్ చక్రకోళ్ల రామదాసు, చౌడం రవీంద్ర తదితరులు తరలివచ్చారు. విజయకుమార్ మృతదేహాన్ని సందర్శించారు. నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు.  
 
 తల్లిడిల్లిన హృదయం
 తన బిడ్డ ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లాడని, ఇక రాడని తెలిసి విజయకుమార్ తల్లి సుజానమ్మ తల్లడిల్లిపోయారు. అండగా ఉంటాడనుకుంటిమే.. మమ్మల్ని వదిలేసి ఎళ్లిపోతివా బిడ్డా.. అంటూ ఆమె విగతజీవిగా మారిన కుమారుడిపై పడి రోదించడం అందరి హృదయాలను బరువెక్కించింది. దేవుడా.. ఎంత అన్యాయం చేశావురా.. మాకు ఎందుకింత శిక్ష విధించావురా సామీ.. అంటూ ఆమె గద్గద స్వరంతో దేవుడ్ని నిలదీయడం చూసి ప్రతి ఒక్కరూ కన్నీరుకార్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు.. స్నేహితులు.. ఇలా అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఫ్రెండ్‌షిప్ డే రోజునే తాము మంచి స్నేహితుడ్ని కోల్పోవడం దురదృష్టకరమని అతని మిత్రులు బిగ్గరగా ఏడ ్వడం కరకు హృదయాలను సైతం కరిగించింది.  
 

మరిన్ని వార్తలు