పోర్టు భూసమీకరణ నోటిఫికేషన్... నెల రోజుల్లో

21 Nov, 2015 00:55 IST|Sakshi

మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి
విజయవాడలో   కీలక సమావేశం
 పోర్టు భూసేకరణకు కసరత్తు
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ‘మచిలీపట్నం డెవలప్‌మెంట్ అథారిటీ’

 
విజయవాడ : మచిలీపట్నం పోర్టు భూసమీకరణ నోటిఫికేషన్ నెలరోజుల్లో విడుదల చేయనున్నట్లు ఎక్సైజ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములను రైతుల అంగీకారంతో తీసుకోనున్నట్లు చెప్పారు. శుక్రవారం రాత్రి విజయవాడలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో భూసమీకరణపై అధికారులు, ప్రజాప్రతినిధులు కసరత్తు చేశారు. ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్  ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్  కూడా హాజరైన ఈ సమావేశంలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి మచిలీపట్నం డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సీఆర్‌డీఏ తరహాలో భూములను అభివృద్ధి చేసి మెగా టౌన్‌షిప్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తొలిదశలో మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రాధాన్యమిస్తామన్నారు. ల్యాండ్ పూలింగ్‌లో సేకరించిన భూయజమానులకు స్థలాలు కేటాయించిన తరువాతే వారి భూములను తీసుకోవటం జరుగుతుందన్నారు.

ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరించిన రైతుల భూములను మాత్రమే సమీకరణ ద్వారా తీసుకోనున్నట్లు చెప్పారు. బందరు ఎంపీ కొనకొళ్ల నారాయణరావు మాట్లాడుతూ పోర్టు నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్  మాట్లాడుతూ సేకరించిన భూమిలో హడ్కో, ఇతర బ్యాంకులు సమకూర్చే రుణం సుమారు రూ.1500 కోట్ల నుంచి రూ.2వేల కోట్ల నిధులతో అత్యాధునిక వసతులతో మెగా టౌన్‌షిప్ అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. మెగా టౌన్‌షిప్‌లో రోడ్లు, విద్యుద్దీపాలు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలకు అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బాబు.ఎ, జేసీ గంధం చంద్రుడు పాల్గొన్నారు.

 వారంలో ‘విమానాశ్రయ’ నోటిఫికేషన్
 అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర క్యాంపు కార్యాలయంలో గన్నవరం విమానాశ్రయం విస్తరణ, భూసమీకరణపై సమీక్ష నిర్వహించారు. రెండోదశ విస్తరణ కోసం వారంరోజుల్లో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
 

మరిన్ని వార్తలు