నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి

16 Feb, 2019 13:15 IST|Sakshi

బాలుడి డ్రైవింగ్‌తో అదుపుతప్పిన కారు 

 రోడ్డు పక్కన నిల్చున్న ఫార్మాసిటీ కార్మికుడిని ఢీకొట్టడంతో 

 ఘటనా స్థలిలోనే దుర్మరణం 

పరవాడ (పెందుర్తి): కారు యజమాని, అతని వద్ద పనిచేసే ఓ బాలుడి నిర్లక్ష్యంతో నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. తనమానాన తను రోడ్డు పక్కన నిల్చున్నప్పటికీ మృత్యుదేవత కనికరించలేదు. తానాం గ్రామంలో సంభవించిన ఈ దుర్ఘటనలో ఫార్మాసిటీలో పనిచేస్తున్న కార్మికుడు బొమ్మళి రామారావు(39) దుర్మరణం పాలయ్యాడు. మృతుని స్వస్థలం శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం మూలస్వాలాపురం గ్రామంగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి పరవాడ సీఐ పి.పైడిపునాయుడు తెలిపిన వివరాల ప్రకారం... తానాం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్‌ ఆర్‌.సన్యాసిరావు వద్ద బడాని శ్రీనివాసరావు అనే బాలుడు సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 7.27 గంటలకు తన యజమానికి చెందిన కారు శుభ్రం చేశాడు. అనంతరం పూర్తిస్థాయిలో డ్రైవింగ్‌ రాకపోయినప్పటికీ కారును వేరోచోట పార్కింగ్‌ చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కారు ఒక్కసారిగా ముందుకు దూసుకుపోయి సమీపంలోని జామ చెట్టును ఢీకొట్టి వేళ్లతో సహా  పెకిలించింది.

 అనంతరం ఎదురుగా రోడ్డు పక్కన నిల్చున్న  రామారావు అనే కార్మికుడిని బలంగా ఢీకొట్టింది. మరో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి పాన్‌ షాపును గుద్దుకుని ఆగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పరవాడ సీఐ పి.పైడిపునాయుడు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకొన్నారు. రామారావు మృతదేహన్ని పోస్టుమార్టం కోసం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన రామారావు ఫార్మాసిటీలోని టోరంటో పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్య బిందు, ప్రవల్లిక, భాను అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన రామారావు కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అందరినీ కంటతడి పెట్టించింది. రామారావు మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 

మరిన్ని వార్తలు