‘ఎమ్మెల్యేనైన నాకు చెప్పరా?’

3 Dec, 2014 01:04 IST|Sakshi
‘ఎమ్మెల్యేనైన నాకు చెప్పరా?’

ఆలమూరు :‘‘నియోజకవర్గంలో ఏం జరుగుతుంతో ముందుగా నాకు తెలియాలి... అటువంటిది నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా అభివృద్ధి కార్యక్రమాల షెడ్యూల్‌ను ఎలా రూపొం దించారు. మీకసలు ప్రొటోకాల్ పద్ధతులు తెలుసా? తెలియకపోతే నేర్చుకోండి’’ అంటూ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధికారులపై మండిపడ్డారు. ఒకానొక దశలో ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమ షెడ్యూల్‌ను నిర్ణయించిన తర్వాత తనను సంప్రదించడాన్ని ఆయన తప్పుబట్టారు. వివరాల్లోకి వెళితే... నియోజకవర్గంలోని కొత్తపేట, ఆలమూరు మండలాల్లో మంగళవారం జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పలు గ్రామాల్లో సుమారు రూ.రెండు కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఉన్నత పాఠశాలల్లోని అదనపు భవనాలు, గ్రంథాలయాలకు శంకుస్థాపనలు చేశారు.
 
 అయితే ఈ కార్యక్రమ షెడ్యూల్‌ను రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక వసతుల సంస్థ (ఏపీఈడబ్ల్యూఐడీ సీ) అధికారులు ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఖరారు చేశారు. దీంతో ఆయన హైదరాబాద్ ప్రయాణాన్ని వాయిదా వేసుకుని హడావుడిగా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రొటోకాల్ నిబంధనలపై అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఎవరిని అడిగి ఈ కార్యక్రమాల షెడ్యూల్‌ను రూపొందించారని ఏపీడబ్ల్యూఐడీసీ డీఈ ఎం.మంజూష, ఏఈ జి.నాగేంద్రబాబులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా అంతిమంగా నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు. జెడ్పీ చైర్మన్ రాంబాబు సమక్షంలో ఈ ప్రొటోకాల్ రగడ జరిగినా ఆయన స్పందించకపోవడం గమన్హారం. వైఎస్సార్‌సీపీ నాయకురాలు కొల్లి నిర్మలకుమారి, మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాసు, నెక్కంటి వెంకట్రాయుడు, చల్లా ప్రభాకరరావు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు