అభ్యర్థులకు వరం వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌

3 Mar, 2018 13:26 IST|Sakshi

నిడమర్రు : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగార్థుల సౌలభ్యం కోసం అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకుని ‘ఒన్‌టైమ్‌ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌’ విధానం తీసుకువచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రకటనలు వెలువడిన ప్రతిసారి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలంటే నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇబ్బందిగా ఉంటుంది. దీనికి పరిష్కారమే ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఉన్న ‘వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌’ కాలం. ఈ వెబ్‌సైట్‌లో ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలో తెలుసుకుందాం..

ఒక్కసారి ఈ వెబ్‌సైట్‌లో విద్యార్థి/నిరుద్యోగి తమ వివరాలు నమోదు చేస్తే చాలు. మీ అర్హతతో ఉన్న ఉద్యోగాలన్నిటికీ ఆ సమాచారం సరిపోతుంది. ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థి ఒక్కసారి ఒన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే అభ్యర్థి అర్హతలకు తగ్గ ఉద్యోగ నోటిఫికేషన్‌ వెలువడగానే అభ్యర్థి సెల్‌ఫోన్‌కు, ఈ–మెయిల్‌కు ఆ ప్రకటన పూర్తి సమాచారం చేరుతుంది. 

టెన్త్‌ నుంచే నమోదుకు అవకాశం
పదో తరగతి, ఆపై విద్యార్హత ఉన్న ప్రతి అభ్యర్థి తమ వివరాలను ఏపీపీఎస్‌ వెబ్‌సైట్‌లో పొందుపరుచుకోవచ్చు. ఏపీపీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌ ఠీఠీఠీ.pఛిట.్చp.జౌఠి.జీn లోకి లాగిన్‌ అవ్వాలి. కనిపించే ముఖ చిత్రం దిగువభాగం కుడివైపు ‘వన్‌టైమ్‌ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌’ అనే కాలం కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చెయ్యాలి. వెంటనే డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్, డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌ అనే రెండు ట్యాబ్‌లు వస్తాయి. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌లోని న్యూరిజిస్ట్రేషన్‌ క్లిక్‌ చెయ్యగానే ఓటీఆర్‌ దరఖాస్తు వస్తుంది. అందులో అభ్యర్థి వివరాలు పొందుపరచాలి. పూర్తిపేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, గ్రామం, మండలం, జిల్లా, కులం, మతం, మాతృభాష, అంగవైకల్యం ఉంటే వాటి వివరాలు ఉద్యోగం చేసినా, చేస్తున్నా వాటి వివరాలు, శాశ్వత చిరునామా, ప్రస్తుత చిరునామా వ్యక్తి గత సమాచారంలో పొందుపరచాలి. విద్యార్హతలకు సంబంధించిన ధృవపత్రాల వివరాలు (ఉత్తీర్ణత సంవత్సరం, హాల్‌టికెట్‌ నంబర్‌ తదితర వివరాలు) నమోదు చెయ్యాలి. అదనపు విద్యార్హతలు ఉంటే యాడ్‌ క్వాలిఫికేషన్‌లో నమోదు చేసుకోవచ్చు.

శాతం లేదా గ్రేడ్‌ రూపంలో..
ప్రతి స్థాయిలోను (టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లమో తదితర పరీక్షలు) వచ్చిన మార్కులను శాతంలో గానీ గ్రేడ్‌ రూపంలోగానీ తెలియజెయ్యాలి. ఐడెంటిఫికేషన్‌ గుర్తులు అంటే పుట్టుమచ్చలు/ గాయపు గుర్తులు మొదలైనవాటిని టెన్త్‌ సర్టిఫికెట్‌లో ఉన్నవాటినే పేర్కొనాలి. అభ్యర్థి ఆధార్‌ కార్డు వివరాలు నమోదు చెయ్యాలి.

ఫొటో, సంతకం అప్‌లోడ్‌
పై సమాచారంతో పాటు 50 కేబీ పరిమాణంలో ఉన్న జేపీఈజీ ఫార్మాట్‌లోని 3.5 సెం.మీ అడ్డం, 4.5 సెం. మీ నిలువు ఉన్న అభ్యర్థి ఫొటోను అప్‌లోడ్‌ చెయ్యాలి. దాని కింద అభ్యర్థి పేరు, ఫొటో తీసిన తేదీని కూడా రాయాలి. చివరగా మీ పూర్తి సంతకాన్ని బ్లాక్‌ ఇంకుతో చేసి దాన్ని కూడా అప్‌లోడ్‌ చెయ్యాలి.

నోటిఫికేషన్‌ అలెర్ట్‌ క్లిక్‌ చెయ్యాలి
వివరాలు అప్‌లోడ్‌ చేసిన తర్వాత నోటిఫికేషన్‌ అలెర్ట్‌ కింద తప్పనిసరిగా టిక్‌ మార్కు చేర్చితే ఏవైనా ఉద్యోగ ప్రకటనలు వెలువడినపుడు ఆ సమాచారం మీ మొబైల్‌/ఈ–మెయిల్‌ ఐడీలకు వస్తుంది. అనంతరం డిక్లరేషన్‌ ఓకే చేస్తే మీరు పొందు పరిచిన వివరాలన్నా ప్రీవ్యూ లభిస్తుంది. హార్డ్‌ కాపీని ప్రింట్‌ తీసుకుని వివరాలు సరిచూసుకున్నాక సెండ్‌ బటన్‌ క్లిక్‌ చెయ్యాలి. ఈ హార్డ్‌ కాపీ భద్రపరుచుకోవాలి. ఈ వివరాలను సరిచూసుకున్నాక ఏపీపీఎస్‌సీ నుంచి అభ్యర్ధుల సెల్‌ఫోన్‌కు, మెయిల్‌కు పది అంకెల పాస్‌వర్డ్‌/ఐడీ పంపుతుంది. ఈ పాస్‌వర్డ్‌ సాయంతో అభ్యర్థులు సర్వీస్‌ కమిషన్‌ నుంచి వివిధ నోటిపికేషన్ల వివరాలు పొందవచ్చు.

నమోదు విషయంలో అజాగ్రత్త వద్దు
ఆన్‌లైన్‌లో సమాచారం పొందుపరిచేటపుడు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి. దరఖాస్తు నింపేటపుడు ఏమరుపాటు లేకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలి. ఓటీఆర్‌ చివరన అభ్యర్థి డిక్లరేషన్‌లో ఏదైనా తప్పుడు సమాచారం పొందుపరిస్తే ఏపీపీఎస్‌సీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని అంగీకరించినట్టు ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు కచ్చితమైన, నిజమైన సమాచారం మాత్రమే పొందుపరచాలి. ఆధారాలు లేని సమాచారం నమోదు చెయ్యడం ప్రమాదకరం.

ప్రయోజనాలు ఇవీ
ఉద్యోగ ప్రకటన వెలువడిన వెంటనే ముందుగా ఇచ్చిన నమోదు సంఖ్య ఆధారంగా కేవలం నిర్ణీత రుసుం చెల్లిస్తే సరిపోతుంది.
దస్త్రాలు, దరఖాస్తులతో ఎటువంటి పని ఉండదు. దీని వల్ల ప్రతిసారి నెట్‌ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు, డేటా బ్యాంక్‌లో విద్యార్హతలు నమోదై ఉండటం వల్ల వెలువడుతున్న నోటిఫికేషన్‌లకు అవసరమైతే అర్హత పరిగణనలోకి తీసుకుం టుంది. ఏ పరీక్షలకు వెళుతున్నారో ఆ పరీక్ష కోడ్‌ సంఖ్యను సూచించి ఫీజ్‌ చెల్లిస్తే సరిపోతుంది.
ఏటా కొత్తగా పొందే విద్యార్హతలను అభ్యర్థి తనకిచ్చిన ప్రొఫైల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో మాత్రమే పోటీ పరీక్షలు
అభ్యర్థి ప్రొఫైల్‌ను ఆన్‌లైన్‌లో పొందు పరిచే విధానం అందుబాటులో తెచ్చిన ఏపీపీపీఎస్‌ ప్రతి పోటీ పరీక్షలకు విడుదలైన నోటిఫికేషన్‌లకు సంబంధింన ప్రతి పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలోనే నిర్వహిస్తున్నారు.. ఈ పోటీ పరీక్షలకు సంబంధించి ఆన్‌లైన్‌ విధానంలో రాసేవారు ఇబ్బందులు పడకుండా మాక్‌ టెస్ట్‌లను ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో పొందిపరిచి ఉన్నాయి. దీనివల్ల ఆన్‌లైన్‌ పరీక్ష అంటే ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అభ్యర్థులు గమనించవచ్చు.

మరిన్ని వార్తలు