200 మంది బాలికలకు ఒకటే మరుగుదొడ్డి

28 Jul, 2018 14:13 IST|Sakshi
శిథిలావస్థలో ఉన్న మరుగుదొడ్డి 

వీరఘట్టం జూనియర్‌  కళాశాలలో దౌర్భాగ్యం

ఇబ్బందులు పడుతున్న పిల్లలు

వీరఘట్టం శ్రీకాకుళం :  అన్ని విద్యాసంస్థల్లో మరుగుదొడ్లు ఉండాల్సిందే. మరుగు సమస్య లేకుండా చూడాలి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశం ఇది. అయితే ఈ ఆదేశం అన్నిదగ్గర్ల అమలవుతోందో..లేదో తెలియదుగాని..వీరఘట్టం ప్రభు త్వ జూనియర్‌ కళాశాలలో మాత్రం అమలు జరగడం లేదు. ఇక్కడ 200 మంది అమ్మాయిలతోపాటు.. మరో 250 మంది మగపిల్లలు చదువుతున్నారు.

అందుకుతగ్గట్టుగా మరుగుదొడ్లు లే వు. దీంతో అత్యవసర సమయంలో సమీపంలో ని తుప్పలు, డొంకల చాటుకు వెళ్లాల్సి రావడం సిగ్గుపడాల్సి విషయమే. ఈ కళాశాలలో మరుగుదొడ్లు నిర్మించాలని పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి పలుమార్లు అధికారులను కోరా రు. జిల్లా కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్లారు. అయితే సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. 

పరిస్థితి ఇదీ

సుమారు 50 ఏళ్ల చరిత్ర ఉన్న వీరఘట్టం ప్రభు త్వ జూనియర్‌ కళాశాలలో మౌలిక వసతుల లేమితో విద్యార్థినీ విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు. వీరఘట్టం, వంగర, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లోని పలు గ్రామాల కు చెందిన పిల్లలు ఇంటర్‌ చదువుకు ఈ కళాశాలలో చేరుతుంటారు. ప్రస్తుతం ప్రథమ, ద్వితీ య సంవత్సరం కలిపి సుమారు 450 మంది పిల్లలు ఉండగా.. వీరిలో 200 మంది అమ్మాయిలు.

వీరందరికీ ఒకే మరుగుదొడ్డి ఉంది. అది కూడా శిథిలమైంది. దీంతో మరుగు సమస్యతో నిత్యం విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయంలో కాలేజీకి సమీపంలో ఉన్న తుప్పులు..డొంగల వైపు వెళ్లలేక బాలికలు బాధపడుతున్నారు.

పట్టించుకోని ఇంటర్‌ బోర్డు !

ఫీజుల పేరిట వేలాది రూపాయలు వసూలు చేస్తున్న ఇంటర్మీడియెట్‌ బోర్డు కళాశాలలో మౌలి క వసతుల కల్పనకు చర్యలు చేపట్టకపోవడం దారుణమని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇలా ఎన్ని రోజులు తమ పిల్లలు ఇబ్బందులు పడాలని ప్రశ్నిస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

కళాశాలలో మరుగుదొడ్ల సమస్యతో విద్యార్థులు, స్టాఫ్‌ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. బిల్లింగ్‌ల కొరతకూడా ఉంది. ఇటీవల కొత్తగా విధుల్లో చేరాను. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. – పి.శంకరరావు, ప్రిన్సిపాల్, వీరఘట్టం జూనియర్‌ కాలేజీ

ఎవరితో చెప్పుకోలేకపోతున్నాం

కళాశాలలో చేరి ఏడాది గడిచింది. మా సమస్యలను ఎవరితో చెప్పుకోలేక నిత్యం  చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఉన్న ఒక మరుగుదొడ్డి కూడా శిథిలమైంది. 

– కె.నాగమణి, ద్వితీయ సంవత్సరం విద్యార్థిని

ఆరుబయటకు వెళ్తున్నాం

మరుగుదొడ్లు లేకపోవడంతో అత్యవసరవేళ ఆరుబయటకు వెళ్తున్నాం. సిగ్గుతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి మరుగుదొడ్లు నిర్మించి మా ఇబ్బందులు తీర్చాలి.

   – ఎ.సుశీల, ద్వితీయ సంవత్సరం విద్యార్థిని

మరిన్ని వార్తలు