రాములోరి కల్యాణానికెళ్లి..

1 Apr, 2018 08:05 IST|Sakshi
మీనా పెంపుడు కుమార్తె నాగజ్యోతిని ప్రశ్నిస్తున్న తహసీల్దారు సత్యనారాయణ (ఇ¯Œ సెట్‌లో) మోర్ల మీనా

 ఒంటిమిట్టలో పెడనకు చెందిన మీనా మృతి

మరొకరి ఆచూకీ కోసం గాలింపు

ఆమె రోజు వారీ కూలి... భక్తిభావం ఎక్కువ.. తరుచూ దేవాలయాలకు వెళ్తుంటోంది.. శ్రీరాముడి కల్యాణం చూడాలని ఎప్పటి నుంచో ఆశ.. ఎట్లాగైనా చూద్దామనుకుంది.. సాధారణంగా భద్రచలం వెళ్తారు.. ఈ ఏడాది బంధువులు ఒంటిమిట్ట వెళ్తున్నారని తెలుసుకుంది.. వారితో ఆమె పయనమైంది.. కల్యాణ మండపానికి చేరింది.. కల్యాణాన్ని కనులారా వీక్షించాలని కోటి ఆశలతో ఎదురుచూస్తోంది... రాముడి కల్యాణ గడియాలు వచ్చేశాయి.. ఆ గడియాలు ఆమె చివరి గడియాలు అని ఊహించలేదు.. వరుణదేవుడు ఇరుసుకుపడ్డాడు.. సృష్టించిన బీభత్సంలో కొందరు మృత్యువు కౌగిలికి చేరారు.. అందులో పెడనకు చెందిన మీనా ఉంది. 

పెడన: శ్రీరాముడి కల్యాణం తిలకించేందుకు పెడన పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన మోర్ల మీనా, ఇదే కాలనికి చెందిన కౌతవరపు సాంబశివరావు(చిన్న) వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్టకు ఈ నెల 28వ తేదీ రాత్రి బయలుదేరి వెళ్లారు. మచిలీపట్నంలో నివాసం ఉంటున్న తన అక్క కేశన కమల, మరికొందరు కలసి వెళ్లింది. 29వ తేదీన కడపకు చేరుకున్నట్లు పెంపుడు కుమార్తె నాగజ్యోతికి సమాచారం ఇచ్చింది. శుక్రవారం కల్యాణోత్సవం విషాదం చోటుచేసుకుంది. వరుణుడు దెబ్బకు నలుగురు చనిపోయారు. అందులో మీనా ఉన్నారు. సాంబశివరావు ఆచూకీ తెలియాల్సి ఉంది.

కలంకారీ పనులకు వెళ్తూ.. 
మీనా తల్లిదండ్రులకు ఆరుగురు సంతానం. మీనాకు పెళ్లయిన కొత్తలోనే భర్త వెంకటస్వామి విడిపోవడంతో  సోదరి కుమార్తెను పెంచుకుంది. కొత్తిమీర కట్టలను విక్రయిస్తూ, కలంకారీ పనులకు వెళ్తూ కుమార్తె నాగజ్యోతిని పెంచింది. 

తహసీల్దారు విచారణ..
ఒంటిమిట్టలో చనిపోయిన మోర్ల మీనా ఇంటికి తహసీల్దారు ఎంవీ సత్యనారాయణ వెళ్లి శనివారం మధ్యాహ్నం విచారణ నిర్వహించారు. ఎప్పుడు వెళ్లింది, ఎవరెవరు వెళ్లింది, తదితర వివరాలతో పాటు ఒంటిమిట్టకు వెళ్లిన వారి ఫోన్‌ నంబర్లు తీసుకుని ఆరా తీశారు. కౌతవరపు సాంబశివరావు వివరాలు మాత్రం పూర్తిగా అందలేదు.  చంద్రన్న బీమా కింద తక్షణ సాయం మట్టిఖర్చుల నిమిత్తం రూ.5వేలను కుటుంబ సభ్యులకు అందజేశారు. నెల్లూరులో ఉన్న మీనా చెల్లెలు గోవర్ధన్‌ బంధువులు ఒంటిమిట్టకు వెళ్లి మృతదేహాన్ని తీసుకొస్తున్నట్లు సోదరి జ్యోతి తెలిపింది. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెప్పారు. తహసీల్దార్‌ వెంట వార్డు కౌన్సిలర్‌ గరికిముక్కు చంద్రబాబు, పట్టణ వీఆర్వో హరికృష్ణ ఉన్నారు.

>
మరిన్ని వార్తలు