ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి నేటికి ఏడాది

9 Jan, 2020 04:46 IST|Sakshi

సుదీర్ఘ పాదయాత్రతో చరిత్ర సృష్టించిన వైఎస్‌ జగన్‌ 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ అమరావతి: ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన చరిత్రాత్మక ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసి నేటికి సరిగ్గా ఏడాది అవుతోంది. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి 2017 నవంబర్‌ 6వ తేదీన మొదలైన ప్రజా సంకల్ప యాత్ర గత ఏడాది జనవరి 9వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్లు, 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు, 2,516 గ్రామాల మీదుగా సాగిన ప్రజా సంకల్పయాత్రకు అడుగడుగునా అన్ని వర్గాల ప్రజలు నీరాజనాలు పలికారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి గత ఏడాది మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే హామీల అమలుకు శ్రీకారం చుట్టారు.

ముఖ్యమంత్రిగా తొలి సంతకంతోనే అవ్వా తాతల పింఛన్‌ను రూ.2,250 చేసి దివంగత వైఎస్సార్‌ సంక్షేమ వారసత్వాన్ని కొనసాగించారు. ఏటా రూ.250 పెంచుకుంటూ వెళతామని చెప్పారు. మీ కష్టాలు నేను విన్నాను.. నేను ఉన్నాను.. అని చెప్పిన మాటను మరవకుండా అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు. మేనిఫెస్టోలో చెప్పిన మేరకు నవరత్నాల పథకాల్లో 90 శాతం ఇప్పటికే అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకున్నారు. ప్రజా సంకల్ప యాత్ర ముగించి నేటికి సరిగ్గా ఏడాడైన నేపథ్యంలో ఇదే రోజు ప్రతిష్టాత్మక ‘అమ్మ ఒడి’ పథకానికి శ్రీకారం చుడుతుండటం విశేషం.    

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు