పెద్దనోట్ల రద్దు ప్రకటించి నేటికి ఏడాది

8 Nov, 2017 10:18 IST|Sakshi

ఐదు నెలలపాటు కొనసాగిన నగదు కొరత 

నిత్యావసరాలకు కూడా నగదు దొరకని వైనం

కళ తప్పిన క్రిస్మస్, సంక్రాంతి పండుగలు 

దుకాణం అద్దె చెల్లించేందుకు వ్యాపారుల అష్టకష్టాలు

సాక్షి, రాజమహేంద్రవరం: 2016 నవంబర్‌ 8... ఈ రోజు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేనిది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ రోజు రాత్రి 9 గంటలకు చేసిన ప్రకటన టీవీల్లో చూసిన ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురయ్యారు. నవంబర్‌ 8వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశంలో రూ.1000, రూ.500 నోట్ల చెలామణి రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. పేదవాడి నుంచి ధనవంతుల వరకూ ప్రతి ఒక్కరూ పెద్దనోట్లు రద్దు బాధల బారిన పడ్డారు. రద్దు ప్రకటించిన రెండు రోజుల విరామం తర్వాత బ్యాంకుల్లో వాటిని మార్చుకోవచ్చని చెప్పడంతో ప్రజలు బ్యాంకుల వద్ద బారులుదీరారు. చిన్నాపెద్దా తేడా లేకుండా...బ్యాంకు ఖాతా ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ బ్యాంకుల ముందు క్యూ కట్టారు. నగదు మార్చుకోవడంపై పలుమార్లు పరిమితులు విధించినా నగదు కొరత తీరలేదు.  ఎప్పడు నగదు వస్తుందో బ్యాంకు అధికారులకూ తెలియని పరిస్థితి. మరో వైపు తమ రోజు వారీ అవసరాలకు కూడా నగదు లేక బ్యాంకుల వద్ద పనులు మానుకుని ప్రజలు పడిగాపులు కాశారు. 

50 రోజులన్నది.. 100 రోజులు దాటింది... 
నగదు మార్పిడి ఇబ్బందులన్నీ డిసెంబర్‌ 31 నాటికి 50 రోజుల్లో సమసిపోతాయని ప్రధాని మోదీ ప్రకటించినా ఆ సంఖ్య వంద రోజులు దాటింది. ఎప్పటికప్పుడు నగదు కొరత తలెత్తడంతో బ్యాంకుల వద్ద రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. సందట్లో సడేమీయాలా జిల్లాలో ధనవంతులు పేదలతో తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకున్నారు. ఇందుకు బలం చేకూరేలా అనేక ఘటనలు జరిగాయి. పైగా జిల్లాలో నగదు మార్చుకునేందుకు ధనవంతులు, రాజకీయ నేతలు ఒక్కరు కూడా బ్యాంకుల వద్ద క్యూల్లో కనపడకపోవడం గమనార్హం. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల శాఖలు 794 ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 330 శాఖలున్నాయి. పట్టణాలు, నగరాల్లో ఉన్న బ్యాంకుల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో నగదు కొరత సమస్య తీవ్రంగా ఉండడంతో పింఛన్‌దారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఏటీఎంల డొల్లతనం... 
పెద్దనోట్ల రద్దు సమయంలో జిల్లాలో కేవలం ఐదు శాతం ఏటీఎంలే పని చేశాయి. నగదు కొరత వల్ల అన్ని ఏటీఎంలలో బ్యాంకులు నగదును పెట్టలేకపోయాయి. జిల్లాలో ప్రస్తుతం 815 ఏంటీఎంలున్నాయి. పెద్దనోట్ల రద్దు సమయానికి జిల్లాలో 811 ఏటీఎంలు ఉండగా వీటిలో 40 ఏటీఎంలలో కూడా నగదు దొరకని పరిస్థితి. నగదు పెట్టిన కొద్ది నిమిషాలకే ఖాళీ అయిపోయేవి. సాధారణ ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు డిసెంబర్, జనవరి మొదటి వారాల్లో తమ జీతాలు తీసుకోవడానికి కూడా ఏటీఎంలలో నగదు లేకపోవడంతో కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకపోయారు. దాదాపు నాలుగు నెలలపాటు కొనసాగిన నగదు నిల్వల కొరతతో ఏటీఎంల నిర్వహణ ఆగిపోయింది. ఫలితంగా జిల్లాలో బ్యాంకులు, ప్రధాన కూడళ్లలో ఉన్న ఏటీఎంలు తప్ప మిగిలిన చోట్ల దాదాపు 30 శాతం ఏటీఎంలలో సాంకేతికపరమైన లోపాలు తలెత్తాయి. ఆ సమస్య ఇప్పటికీ కొనసాగుతోంది.

బోసిపోయిన పండుగలు...
ప్రధాన పండుగలైన క్రిస్‌మస్, సంక్రాంతి పడుగలపై పెద్దనోట్ల చెలామణీ రద్దు ప్రభావం స్పష్టంగా కనిపించింది. ర ద్దు నిర్ణయం తీసుకున్న 47 రోజుల తర్వాత డిసెంబర్‌ 25వ తేదీన జరిగిన క్రిస్‌మస్‌ పండుగ, అనంతరం 20 రోజులకు వచ్చిన సంక్రాంతి పండుగలు చేసుకునేందుకు ప్రజల వద్ద నగదు లేని పరిస్థితి. ప్రజల బ్యాంకు ఖాతాల్లో నగదు ఉన్నా ఉపయోగించుకోలేని దుస్థితి. దస్తులు, తినుబండారాలు కూడా కొనుగోళ్లు కనీసం 5 శాతం కూడా జరగలేదు. వస్త్ర వ్యాపారులు మూడు నెలలపాటు కనీసం అద్దెలు చెల్లించుకునేలా కూడా వ్యాపారం జరగలేదంటే పెద్దనోట్ల చెలామణి రద్దు ప్రభావం ఎలా ఉందో అర్థమవుతోంది. పండుగల సీజన్‌లో జిల్లాలో దాదాపు 200 కోట్ల మేర వస్త్ర వ్యాపార రంగం నష్టపోయింది. ఇక సిబ్బంది జీతాలు చెల్లించలేక కొన్ని దుకాణాల వారు దీర్ఘకాలిక శెలవులు ప్రకటించాయి. 

కిరాణా తెచ్చుకోవడానికీ డబ్బులు లేవు.. 
పెద్దనోట్లు రద్దు చేసిన తర్వాత దాదాపు రెండు నెలల వరకూ డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డాం. రెండు వేల నోటు చిల్లర కోసం అష్టకష్టాలు పడ్డాం. ఆ రోజులు మళ్లీ ఊహించుకోలేమండి. ఇంట్లో కిరాణా సామాన్లు తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. దుకాణాల వద్ద అప్పులు చేశాం. 
– కె.లక్ష్మీ, గృహిణి, రాజమహేంద్రవరం.

పండగల్లో వ్యాపారం కుదేలు
ఏడాదిలో 11 నెలలపాటు జరిగే వ్యాపారం ఒకెత్తు. క్రిస్‌మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి సీజన్‌ నెల రోజుల్లో జరిగే వ్యాపారం అతి ముఖ్యమైనది. 11 నెలల్లో ఎంత వ్యాపారం జరుగుతుంతో అంతకు మించిన వ్యాపారం ఆ నెలలో జరుగుతుంది. గత ఏడాది పెద్దనోట్ల రద్దు వల్ల వ్యాపారం అస్సలు జరుగ లేదు. దాదాపు ఆరు నెలలు ఖర్చులు కూడా పూడ్చుకోలేకపోయాం. 
– దాసరి ప్రకాశరావు, వస్త్రవ్యాపారి, రాజమహేంద్రవరం.

మరిన్ని వార్తలు