'ఉమ్మడి' ఏడాది చాలు

18 Nov, 2013 03:35 IST|Sakshi

న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించినా సీమాంధ్రలో కొత్త రాజధానిని ఏడాదిలోపే నిర్మించుకునేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని తెలంగాణ కేంద్ర మంత్రులు విభజనపై జీవోఎంకు నివేదించనున్నారు. ఒకవేళ అక్కడి ప్రభుత్వం జాప్యం చేసినట్లయితే కేంద్రమే జోక్యం చేసుకుని త్వరితగతిన కొత్త రాజధానిని నిర్మించి సీమాంధ్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అక్కడికి తరలించాలని కోరనున్నారు.  
 
 టీ- కేంద్రమంత్రుల బృందం సోమవారం జీవోఎంతో భేటీ అవుతున్న నేపథ్యంలో.. ఆ కమిటీ ఎదుట ప్రతిపాదించాల్సిన అంశాలపై కాంగ్రెస్ తెలంగాణ నేతలు ఆదివారం కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో సమావేశమై నివేదికను రూపొందించారు. కేంద్రమంత్రులు సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, రాష్ట్ర మంత్రులు కె.జానారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఆరెపల్లి మోహన్, శ్రీధర్, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కె.యాదవరెడ్డి, సీనియర్ నేతలు బి.కమలాకరరావు, మల్లు రవి, వకుళాభరణం కృష్ణమోహన్, గంగాధర్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు నివేదికలోని అంశాలు ఇంకా ఇలావున్నాయి...
 
  హైదరాబాద్ పరిధిలో శాంతిభద్రతలు తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే ఉండాలి. వాటి పర్యవేక్షణ బాధ్యతను మాత్రం తెలంగాణ, సీమాంధ్ర సీఎంలు, డీజీపీలతో కమిటీని వేసి కేంద్ర ప్రతినిధిని కన్వీనర్‌గా నియమించి అందించాలి. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాం.
  ప్రజాహితం కోసం కాకుండా స్వలాభం కోసం వివిధ సంస్థలకు కట్టబెట్టిన భూముల వ్యవహారంపై విచారణ జరిపి వాటిని స్వాధీనం చేసుకునే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుంది. నిబంధనల మేరకు ప్రభుత్వ భూములను సక్రమంగా వినియోగించుకుంటున్న సంస్థలు యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.
 
  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే శాసనమండలిని కూడా పునరుద్ధరించాలి. తెలంగాణ బిల్లులోనే ఈ అంశాన్ని స్పష్టంగా పొందుపర్చాలి.
  సాగునీటి కేటాయింపుల్లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పును అమలు చేయాలి. బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలి.
  విభజన బిల్లులో హైకోర్టు, ఏపీపీఎస్సీ ఏర్పాటు ను ప్రస్తావించాలి. విభజన జరిగిన తరువాతే నియామకాలు చేపట్టాలి. హైకోర్టు జడ్జీల నియామకంలో తెలంగాణ వారికే ప్రాధాన్యమివ్వాలి.
 
  పోలవరం ప్రాజెక్టుతో పాటు ప్రాణహిత-చేవెళ్ల, కంతనపల్లి, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఇవ్వాలి.
  తెలంగాణతో పాటు సీమాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలన్నింటికీ ప్రణాళిక సంఘం ద్వారా తగిన ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి అభివృద్ధి చేయాలి.
  రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో తీవ్ర విద్యుత్ కొరత నెలకొనే అవకాశమున్నందున కేంద్రం ఈ అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. బోర్లపై వ్యవసాయం ఆధారపడి ఉన్నందున ప్రస్తుతం రాష్ట్రంలో సరఫరా చేస్తున్న విద్యుత్‌లో 56 శాతం తెలంగాణకు, 44 శాతం సీమాంధ్రకు కేటాయిస్తున్నారు. విభజన జరిగిన తరువాత కూడా ఇదే నిష్పత్తిని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి.

>
మరిన్ని వార్తలు