కేజీ బేసిన్‌.. చమురు నిక్షేపాలు దొరికెన్‌!

14 Jul, 2019 04:20 IST|Sakshi
సముద్రగర్భంలో ఓఎన్జీసీ కార్యకలాపాలు

ఫలించిన ఓఎన్జీసీ రెండేళ్ల విస్తృత అన్వేషణ

పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగుచోట్ల చమురు నిక్షేపాల గుర్తింపు

రెండుచోట్ల సర్వే డ్రిల్లింగ్‌ పనులు పూర్తి

3 నెలల్లోగా గ్యాస్‌ ఉత్పత్తి ప్రారంభం!

రోజుకు 35 నుంచి 40 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్, 1,400 టన్నుల ఆయిల్‌ వెలికితీత లక్ష్యం

నరసాపురం: కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్‌ పరిధిలోని ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో చమురు నిక్షేపాల కోసం ప్రభుత్వరంగ దిగ్గజం ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్జీసీ) అధికారులు రెండేళ్లుగా చేస్తున్న అన్వేషణ సత్ఫలితాలనిచ్చింది. తాజాగా చమురు నిక్షేపాల కోసం అధికారులు వేగం పెంచి విస్తృతంగా అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగుచోట్ల అపారంగా గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. ఇవన్నీ కొత్త బావులు కావడం విశేషం. ఇప్పటికే రెండుచోట్ల సర్వే డ్రిల్లింగ్‌ పనులు పూర్తి చేశారు.

మిగిలిన రెండు చోట్ల కూడా గ్యాస్‌ వెలికితీతకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేజీ బేసిన్‌ పరిధిలో నరసాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు దశాబ్దాలుగా తవ్వుతున్న బావులు ఖాళీ అయ్యాయి. దీంతో ఉత్పత్తిని పెంచేందుకు ఓఎన్జీసీ రెండేళ్ల నుంచి నరసాపురం, పాలకొల్లు, యలమంచిలి, మార్టేరు, పెనుగొండ, భీమవరం ప్రాంతాల్లో అన్వేషణ ప్రారంభించింది. మార్టేరు, పెనుగొండ ప్రాంతాల్లో పెద్దస్థాయిలో, మొగల్తూరు మండలం ఆకెనవారితోట, భీమవరం సమీపంలోని మహాదేవపట్నం, వేండ్ర వద్ద మొత్తం నాలుగుచోట్ల చమురు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించి, వెలికితీతకు ఉపక్రమించారు.

నాలుగు దశాబ్దాలుగా కార్యకలాపాలు
నాలుగు దశాబ్దాలుగా నరసాపురం కేంద్రంగా ఓఎన్జీసీ కార్యకలాపాలు సాగుతున్నాయి. అయితే మూడు దశాబ్దాల పాటు ఓఎన్జీసీ కేవలం ఆన్‌షోర్‌పైనే దృష్టి పెట్టింది. రిలయన్స్, గెయిల్‌ వంటి ప్రైవేట్‌ ఆయిల్‌రంగ సంస్థలు రంగప్రవేశం చేయడంతో వాటి పోటీని తట్టుకోవడానికి ఓఎన్జీసీ 2006 నుంచి సముద్రగర్భంలో అన్వేషణలపై దృష్టి సారించింది. ప్రస్తుతం నరసాపురం నుంచి కాకినాడ వరకు సముద్రగర్భంలో డ్రిల్లింగ్‌ జరుగుతోంది.

నరసాపురం మండలం చినమైనవానిలంక తీరానికి సమీపంగా సముద్రగర్భంలో గ్యాస్‌ వెలికితీత ప్రారంభమైంది. అదనపు ఉత్పత్తిలో లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓఎన్జీసీ ప్రస్తుతం ఇదే ప్రధాన వనరుగా భావిస్తోంది. ఆన్‌షోర్‌కు సంబంధించి పశ్చిమగోదావరి జిల్లాలో కవిటం, నాగిడిపాలెం, ఎస్‌–1 వశిష్టాబ్లాక్, 98–2 ప్రాజెక్ట్‌లో, తూర్పుగోదావరి జిల్లా కేశనపల్లి, కృష్ణా జిల్లా బంటుమిల్లి, నాగాయలంక ప్రాంతాల్లో గత కొంతకాలంగా చేపట్టిన అన్వేషణలు పూర్తయ్యాయి. మరో రెండు, మూడు నెలల్లో వీటి ద్వారా ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఓఎన్జీసీ అధికారులు చెపుతున్నారు.

25 శాతం ఉత్పత్తి పెంపు లక్ష్యంగా..
రానున్న ఏడాది మరో 25 శాతం ఉత్పత్తి పెంపు కోసం ఓఎన్జీసీ ప్రయత్నాలు సాగిస్తోంది. రోజుకు 35 నుంచి 40 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్, 1,400 టన్నుల ఆయిల్‌ వెలికితీయడమే లక్ష్యంగా ముందుకెళుతోంది. గ్యాస్‌ వెలికితీతలో ఇప్పటికే దేశంలో మొదటి స్థానాన్ని దక్కించుకున్న ఓఎన్జీసీ.. ఇదే దూకుడుతో లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఆఫ్‌షోర్‌ (సముద్రగర్భం)లో అన్వేషణలకు సంబంధించి నరసాపురం తీరంలో చురుగ్గా కార్యకలాపాలు సాగుతున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లాదే అగ్రస్థానం
కొత్తగా జిల్లాలో కనుగొన్న బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభమైతే, రోజుకు ఇక్కడి నుంచి 4 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ వెలికితీయవచ్చని ఓఎన్జీసీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేజీ బేసిన్‌లో ఓఎన్జీసీ రోజుకు 33 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్, 900 టన్నుల ఆయిల్‌ను వెలికితీస్తోంది. ఇందులో పశ్చిమగోదావరి జిల్లా నుంచే రోజుకు 10 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ ఉత్పత్తి అవుతుంది. కొత్త బావుల ద్వారా మరో 4 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ ఉత్పత్తి ఇక్కడి నుంచి పెరిగితే ఈ జిల్లాదే అగ్రస్థానం అవుతుంది.

మరిన్ని వార్తలు