తడిసి ముద్దయిన జిల్లా

19 Sep, 2014 01:34 IST|Sakshi
తడిసి ముద్దయిన జిల్లా
  • కొనసాగుతున్న అల్పపీడనం
  •   మరో రెండు రోజుల పాటు ఇదే తీరు
  •   ఆరుతడి పంటలకు చేటు, వరికి మేలు
  •   గూడూరులో అత్యధికం..జగ్గయ్యపేటలో అత్యల్పం
  • మచిలీపట్నం :  భారీ వర్షాలు జిల్లాను ముంచెత్తుతున్నాయి. కోస్తా తీరం వెంబడి సముద్ర మట్టానికి 7.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తన కారణంగా  రెండు రోజులుగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే రీతిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.  డెల్టా ప్రాంతంలోని వరికి ఈ వర్షాలు మేలు చేయనుండగా పశ్చిమకృష్ణాలోని ఆరుతడి పంటలకు  మాత్రం చేటు తేనున్నాయి.

    మరో రెండు రోజుల పాటు వర్షాలు ఇదే విధంగా  కురిస్తే పత్తి, మిరప, మొక్కజొన్న, పసుపు పొలాల్లో నీరు నిలబడి మొక్కలు ఎర్రబారి ఉరక దెబ్బతిని చనిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.  జిల్లాలో అత్యధికంగా గూడూరు మండలంలో 64.0, అత్యల్పంగా జగ్గయ్యపేటలో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం  నమోదైంది. గురువారం మధ్యాహ్నం నుంచి జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాల్లో 40.0 మిల్లీమీటర్లు కురిసినట్లు  సమాచారం.
     
    ఆలస్యంగా వరినాట్లు...

    జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగాల్సి ఉండగా, ఇప్పటి వరకు వర్షాభావం, కాలువలకు సాగునీటి విడుదల జాప్యం వల్ల వరినాట్లు ఆలస్యమయ్యాయి. దాదాపు 5.80 లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. మిగిలిన 54 వేల ఎకరాల్లో వరినాట్లు వేసేందుకు ఈ వర్షాలు మేలు చేయనున్నాయి. సెప్టెంబరులోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వరిలో ఎదుగుదల లోపించింది. ప్రస్తుతం  పైరు ఎదుగుదలకు అనుకూలంగా మారిందని రైతులు చెబుతున్నారు.  
     
    మెట్ట పంటలకు చేటే...

    జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో పత్తి, 11,732 ఎకరాల్లో మొక్కజొన్న, 6,352 ఎకరాల్లో కంది, 15,260 ఎకరాల్లో పెసర, 4582 ఎకరాల్లో మినుము, 5705 ఎకరాల్లో వేరుశెనగ, 25,510 ఎకరాల్లో మిర్చి పంటలు సాగవుతున్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. నంది గామ, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో   రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి, మొక్కజొన్న, మిరప, పసుపు సాగు చేసిన పొలాల్లోని సాళ్లలో రోజుల తరబడి నీరు నిల్వ ఉండిపోతోంది. దీంతో మొక్కలు చనిపోయే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు.  
     
    నమోదైన వర్షపాతం...

    జిల్లాలో గురువారం ఉదయం 8గంటలకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. పెడన 58.4 మిల్లీమీటర్లు, విజయవాడ రూరల్, అర్బన్ 58.2, బంటుమిల్లి 46.8, మోపిదేవి 43.6, కృత్తివెన్ను 40.2, ఇబ్రహీంపట్నం 40.2, మైలవరం 35.2, జి.కొండూరు 33.2, కంచికచర్ల 29.4, మచిలీపట్నం 26.1, చల్లపల్లి 25.6, అవనిగడ్డ 24.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుడ్లవల్లేరు 21.4 మిల్లీమీటర్లు, వీరులపాడు 21.2, గంపలగూడెం 18.2, నాగాయలంక 17.2, కోడూరు 14.8, ఘంటసాల 11.2, మొవ్వ 9.8, కలిదిండి 8.4, పమిడిముక్కల 6.2, పెనమలూరు 5.6, విస్సన్నపేట 5.2, నందిగామ 4.6, రెడ్డిగూడెం 4.6, పామర్రు 3.8, చందర్లపాడు 3.4, తిరువూరు, ఉయ్యూరు 3.2, నూజివీడు 2.6, ముదినేపల్లి 2.4, గుడివాడ 1.4, ఎ.కొండూరు, ఆగిరిపల్లి 1.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురవారం పగలు సమయంలోనూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
     
    వరద నీటితో పరుగులు తీస్తున్న కృష్ణమ్మ..

    నందిగామ : కృష్ణా, ఖమ్మం జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నందిగామ ప్రాంతంలోని కట్టలేరు,మునేర్లకు వరద నీరు చేరుతుంది.   సాగర్ ద్వారా కృష్ణానదికి నీరు విడుదల,  తొలిసారిగా పులిచింతల బ్యాలెన్స్‌డు రిజర్వాయర్ నుంచి నీరు దిగువ ప్రాంతానికి విడుదల చేయడంతో నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లోని కృష్ణానదికి నీటిమట్టం పెరిగింది.  నందిగామ నియెజకవరా్గానికి రెండువైపులా నదుల్లో పుష్కలంగా నీరు ప్రవహిస్తుంది.
     
    ప్రమాదకర స్థాయిలో ఏనుగుగడ్డ వాగు...

    ఇబ్రహీంపట్నం రూరల్  : ఎగువ ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఏనుగుగడ్డ వాగు ప్రమాదకర స్థాయికి చేరింది. బుదవారం వరకు వాగులో చుక్కనీరు లేదు. గురువారం సాయంత్రం కొటికలపూడి గ్రామం సమీపంలో ఉన్న వంతెన వద్ద సుమారు 12 అడుగుల ఎత్తులో నీరు చేరింది. వంతెనకు దిగువున అరడుగు దూరంలో నీరు పారుతోంది. చిలుకూరు వంతెన వద్ద పరిస్థితి కూడా ఇదే మాదిరిగా ఉంది. ఈ  రాత్రికి ఓ మోస్తరు వర్షం పడినా వంతెన పైభాగాలకు నీరుచేరి రహదారులను స్తంభింపచేసే అవకాశం ఉందని భయపడుతున్నారు.
     

మరిన్ని వార్తలు