టీడీపీ నేతల్లారా.. ఖబడ్దార్‌ : ఎమ్మెల్యే కంబాల

29 Oct, 2019 11:03 IST|Sakshi
పోలీసులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కంబాల జోగులు  

పెచ్చుమీరిపోతున్న టీడీపీ నేతల ఆగడాలు

అధికారం పోయినా ఆగని దాడులు 

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, వలంటీర్లపై కొనసాగుతున్న దాష్టీకాలు

తాజాగా శ్రీహరినాయుడుపేటలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను గాయపరిచిన పచ్చనేతలు

దాడులు చేసి ఆపై వితండవాదం

రాజకీయం రంగులు మార్చుకుంటోంది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సంక్షేమం గురించి పాటు పడాల్సిన నాయకులు వ్యక్తిగత విమర్శలకు పోయి, కక్షలు పెంచుకుని దాడులు చేస్తూ రాజకీయ ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. దీనికి తోడు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో వినూత్న పాలన అందిస్తున్న వైఎస్సార్‌ సీపీ తీరును జీర్ణించుకోలేక దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా అమాయకులైన వలంటీర్లనే టార్గెట్‌గా చేసుకుని దాడులు చేస్తున్నారు. వీరి తీరును రాజకీయ వేత్తలు ఖండిస్తున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు ఇలా పరువు పోయేలా వ్యవహరించడం సరికాదని హితవు చెబుతున్నారు.  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : సంతకవిటీ మండలం శ్రీ హరినాయుడు పేట గ్రామంలో అక్టోబర్‌ 13వ తేదీన వలంటీరు వావిలపల్లి నారాయణరావుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. పోరంబోకు భూ ములను ఆక్రమించేందుకు యత్నిస్తున్నా రని అధికారులకు సమాచారన్న అక్కసుతో వలంటీర్‌పై దాడి చేశారు.  
సంతకవిటి మండలం కృష్ణంవలస గ్రామం లో సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరారని అక్కసుతో ముద్దాడ బాలకృష్ణ, ముద్దాడ వీరన్న, దాసరి సింహాచలం, ముద్దాడ దుక్కన్నలపై టీడీపీ నేతలు దాడి చేశారు. అలాగే, ముద్దాడ జోగులు, ముద్దాడ రాములు, కిక్కర సూర్యరావుల ఇళ్లపై కూడా దాడి చేశారు.  
రేగిడి మండలం కాగితాపల్లిలో సెప్టెంబర్‌ 9వ తేదీన వలంటీర్‌ కిమిడి గౌరీశంకర్‌పై టీడీపీ నాయకులు ధర్మారావు అనుచరులు దాడి చేశారు.  
అక్టోబర్‌ 1వ తేదీన టెక్కలి మండలం చాకిపల్లి గ్రామంలో కుమారస్వామి, అప్ప న్న అనే ఇద్దరు వలంటీర్లపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.  
సంతబొమ్మాళికి చెందిన కళింగ ఆశ అనే వలంటీర్‌పై దాడి చేశారు.  
పలాస మండలం కిష్టిపురం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు జి.మోహనరావుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అయితే ఆయన తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  
తాజాగా సంతకవిటి మండలం శ్రీహరినాయుడుపేటలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేసి గాయపర్చారు. తాగునీటి పైపులైన్‌ బాగు చేస్తున్న సందర్భంలో అడ్డుకుని టీడీపీ నాయకులు దాడులకు దిగారు. 15మంది టీడీపీ కార్యకర్తల సామూహిక దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు చేసిన దాడుల ఘటనలివి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడైతే లెక్కే లేదు. అధికార మదంతో ఇష్టానుసారంగా దాడులు చేయడమే కాకుండా ఎదురు కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. అయితే టీడీపీ నేతల ప్రస్తుత తీరు చూస్తుంటే మొగుడ్ని కొట్టి మొగసాలకి ఎక్కింది అన్నట్టుగా ఉంది. వారే దాడులు చేసి ఇష్టారీతిన గాయపరిచి, తిరిగి తమపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. మొన్న జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం, నియోజకవర్గ సమీక్షల్లో చంద్రబాబు దగ్గరి నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు ఇదేరకమైన తీరు కనబరిచారు. ఏదో అయిపోతోంది, శాంతి భద్రతలు లోపిం చాయన్నట్టుగా తమ పచ్చ మీడియా ద్వారా ప్రజల్లోకి ఒక దుష్ప్రచారం తీసుకెళ్లేందుకు చంద్రబాబు పర్యటన వేదికగా సాగిందని జనమే చర్చించుకుంటున్నారు. 

వలంటీర్లను వదల్లేదు 
ఇన్నాళ్లూ గ్రామంలో చక్రం తిప్పి, అజమాయిషీ చెలాయించిన టీడీపీ నేతలకు వలంటీర్ల వ్యవస్థ మింగుడు పడటం లేదు. తమ పెత్తనం చెల్లుబాటు కాదనే అక్కసుతో గ్రామాల్లో కొత్తగా నియమించిన వలంటీర్లపై దాడులకు దిగుతున్నారు. వారి అక్రమాలను ఎత్తి చూపిస్తున్నందుకు దౌర్జన్యాలకు పా ల్పడుతున్నారు. ఇప్పటికే దాడుల ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. దాడులు చేసి తిరిగి ఎదురు దాడులకు దిగిన దాఖలాలు చాలా ఉన్నాయి.

అగ్ర నేతల నుంచి గ్రామ స్థాయి నేతల వరకు అదే పరిస్థితి  
టీడీపీ అగ్రనేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌ దగ్గరి నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు అదే ధోరణి సాగిస్తున్నారు. ‘ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తాను. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. నన్ము ఎవరూ ఆప లేరు. చెప్పింది చేయకపోతే నేనేంటో చూపిస్తా.’ అంటూ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శిని మాజీ విప్‌ కూన రవికుమార్‌ బెదిరించిన విషయం అందరికీ తెలిసిందే. దానిపై సంబంధిత అధికారులు ఫిర్యాదు చేస్తే కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండి చివరికీ బెయిల్‌ తెచ్చుకున్నారు. ‘ఏయ్‌ ఎగస్ట్రా చేయొద్దు. ట్రైనింగ్‌ ఎవరిచ్చారు. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు. యూజ్‌లెస్‌ ఫెలో’ అని రాజధాని పోలీసు ఉన్నతాధికారులపై నోరు పారేసుకుని చివరికీ కోర్టు ఆదేశాలతో కింజరాపు అచ్చెన్నాయుడు లొంగిపోయిన విషయం తెలిసిందే.  

అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు ఒకే రకంగా వ్యవహరిస్తున్నారు. అచ్చెన్నాయుడు మంత్రి హోదాలో జిల్లాలో చాలా మంది అధికారులపై, ఉన్నతాధికారులను సైతం ఏకవచన ప్రయోగం, పరుష పదజాలంతో మండిపడటం, బెదిరించడం సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొందరు అధికారులైతే బలి పశువులయ్యారు. ఇక విప్‌గా కూన రవికుమార్‌ ఉన్నప్పుడు ఇసుక దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. టీడీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై పెట్టిన కేసులు అన్నీ ఇన్నీ కావు. గ్రామాల్లో తిరగనిచ్చే పరిస్థితి లేకుండా బెదిరింపులకు దిగారు.  జన్మభూమి కమిటీ సభ్యులైతే చెలరేగిపోయారు. మొత్తానికి అధికారం పోయినా టీడీపీ నేతల దౌర్జన్యాలు, ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి.  

సంతకవిటి: టీడీపీ నేతలు అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వరుస దాడులతో ప్రజలను భయపెట్టి, తమ దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనకు ఆకర్షితులై వైఎస్సార్‌సీపీలో ఆ పార్టీ అభిమానులు చేరుతుండటంతో తట్టుకోలేకపోతున్నారు. జిల్లాలో వరుసగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై చేస్తున్న దాడులే ఇందుకు నిదర్శనం. ఇటీవల కొత్తూరు మాజీ ఎమ్మెల్యే కుమారుడు మారణాయుధాలతో దాడి చేసిన విషయం మరువక ముందే, తాజాగా సంతకవిటి మండలం శ్రీహరినాయుడుపేట పంచాయతీలో టీడీపీ మాజీ వైస్‌ ఎంపీపీ గండ్రేటి కేసరితోపాటు అతని అనుచరులు మూకుమ్మడిగా దాడులు చేశారు. పోలీసులు చూస్తుండగానే వీరంతా రెచ్చిపోయి పది మంది వరకు గాయపర్చారు.  

దాడి ఎలా చేశారంటే... 
గ్రామంలో మరమ్మతులకు గురైన తాగునీటి పైపులైన్‌ను సోమవారం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గండ్రేటి భుజంగరావు, వావిలపల్లి దాలినాయుడు, వావిలపల్లి బాలయ్య, వావిలపల్లి అనంతరావు, వాసులతోపాటు గ్రామ వలంటీర్‌ వావిలపల్లి నారాయణరావు, మరికొంత మంది యువకులు కలసి బాగు చేçసేందుకు సిద్ధపడ్డారు. ఇదే గ్రామానికి చెందిన టీడీపీ మాజీ వైస్‌ ఎంపీపీ గండ్రేటి కేసరితోపాటు మరికొంత మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకుని పనులు అడ్డగించారు. తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, మండల పరిషత్‌ అధికారులు బాగు చేయమన్నారని భుజంగరావు చెప్పగా, తాము గతంలో అక్కడ మరమ్మతులు చేశామని, బిల్లులు కాలేదని, ఇప్పుడు బాగుచేసేందుకు వీలు లేదని అడ్డుకున్నారు. దీంతో ఇరువురు మధ్య వివాదం చెలరేగగా, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అధికారులకు ఫోన్‌ చేశారు.  

బాధితుల వద్ద వివరాలు సేకరిస్తున్న ఎమ్మెల్యే కంబాల జోగులు
పోలీసుల సమక్షంలోనే దాడులు... 
వెంటనే సంతకవిటి ఎస్‌ఐ రామారావుతోపాటు సిబ్బంది అక్కడకు చేరుకుని పనులు చేయించేందుకు ప్రయత్నించారు. ఇదేక్రమంలో గండ్రేటి కేసరితోపాటు అతని కుమారుడు సురేష్, టీడీపీ కార్యకర్తలు జీ లక్షున్నాయుడు, వావిలపల్లి లక్షున్నాయుడు, డోల ప్రసాదు, వీ దాలినాయుడు, జీ చక్రి, జీ చిన్నా, జీ రాము, వీ రామినాయుడు, వీ కేసరి, మీసాల సూరయ్య, జీ దామోదరరావు, జీ సూర్యారావు, జీ ఆదినారాయణ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త భుజంగరావు కాలికి, వావిలపల్లి బాలయ్య నోట్లో, వావిలపల్లి అనంతరావు తలకు, వావిలపల్లి నారాయణరావు, దాలినాయుడుల భుజాలపై తీవ్ర గాయాలయ్యాయి. మరికొంత మంది వైఎస్సార్‌సీపీ అభిమానులు, యువకులు ఈ ఘటనలో గాయపడ్డారు. వెంటనే తేరుకున్న పోలీసులు అదనపు పోలీసు సిబ్బందిని రప్పించడంతోపాటు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
 
మూడో దఫా కూడా బరితెగింపు.. 
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఆ పంచాయతీకి చెందిన టీడీపీ మాజీ వైస్‌ ఎంపీపీ గండ్రేటి కేసరితోపాటు అతని అనుచరులు వరుసగా దాడులు చేస్తున్నారు. జూలై 1న కృష్ణంవలస గ్రామంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు చేరడంతో దాడికి పాల్పడ్డారు. ఈ కేసు ఇంకా కొలిక్కి రాక ముందే అక్టోబర్‌ 12న గ్రామ వలంటీరుపై దాడి చేయగా, ఇంతలో మరో దాడి చేయడం చూస్తుంటే పథకం ప్రకారమేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి సిరిపురపు జగన్‌మోహన్‌రావు ఆరోపించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన బాధితులను పరామర్శించారు. పాలకొండ డీఎస్‌పీ రారాజు ప్రసాద్‌కు సమాచారం అందించారు. వెంటనే డీఎస్పీతోపాటు రాజాం సీఐలు పీ శ్రీనివాసరావు, జీ సోమశేఖర్, అదనపు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన గండ్రేటి కేసరితోపాటు అతడి అనుచరులను సంతకవిటి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గ్రామంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.  

గాయాలపాలైన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు   
15 మందిపై ఫిర్యాదు.. 
టీడీపీ మాజీ వైస్‌ ఎంపీపీ గండ్రేటి కేసరితోపాటు 14 మందిపై బాధితుడు వావిలపల్లి దాలినాయుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మండల పార్టీ శ్రేణులు సంతకవిటి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. అధికారంలో ఉన్నప్పటికీ తమ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. చట్టపరంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది.  
టీడీపీ నేతల్లారా.. ఖబడ్దార్‌ : ఎమ్మెల్యే
టీడీపీ నేతలు గత పాలనలో స్కీంలు పేరుతో స్కాంలు చేశారని, ఇప్పుడు గూండాగిరితో దాడులు చేస్తుంటే, ఊరుకునేది లేదని ఖబడ్డార్‌ అంటూ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ వక్రబుద్ధిని మార్చుకోవాలని, లేదంటే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు.  ఈ సందర్భంగా బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పాలకొండ డీఎస్పీ, సీఐలతో మాట్లాడారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ పరామర్శలో పార్టీ సీనియర్‌ నేతలు ఉరిటి అప్పారావుపట్నాయక్‌నాయుడు, రాగోలు రమేష్‌నాయుడు, కనకల సన్యాసినాయుడు, కెంబూరు సూర్యారావు, వావిలపల్లి వెంకటేశ్వర్లు, బత్తుల జ్యోతీశ్వర్లు, మొయ్యి మోహనరావు, పప్పల గణపతి, పైల వెంకటనాయుడు, రెడ్డి స్వామినాయుడు, యెన్ని శ్రీనివాసరావు, వావిలపల్లి రమణారావు, దవళ నర్సింహమూర్తి, వావిలపల్లి సమీర్‌నాయుడు, కొప్పల ఉమామహేశ్వరరావు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు