కొనసాగుతున్న శ్రీవారి దర్శనాల ట్రయల్ రన్

9 Jun, 2020 08:39 IST|Sakshi

రేపు శ్రీవారిని దర్శించుకోనున్న తిరుమల స్థానికులు

సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనాల ట్రయల్‌ రన్‌ రెండో రోజు ప్రారంభమయింది. నేడు కూడా టీటీడీ ఉద్యోగులతో రాత్రి 7 గంటల వరకు ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు. నిన్న శ్రీవారిని 6,360 మంది దర్శించుకోగా, నేడు మరో ఆరువేల మంది టీటీడీ ఉద్యోగులు దర్శించుకోనున్నారు. రేపు స్థానికులకు అవకాశం కల్పించనున్నారు. 11 నుంచి సాధారణ భక్తులను దర్శనానికి అనుమతించేలా టీటీడీ యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. సోమవారం నుంచి స్వామివారి దర్శనం పునఃప్రారంభం కాగా, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ముందుగా దర్శించుకున్నారు. ఆలయంలో టీటీడీ అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టింది. క్యూలైన్లలో నాలుగు చోట్ల శానిటైజర్లు ఏర్పాటు చేశారు. (దర్శనానికి వేళాయె)

దర్శన క్యూలైన్లతో పాటు అన్న ప్రసాద కేంద్రంలో కూడా ఫుట్ ఆపరేటడ్ కుళాయిలను టీటీడీ ఏర్పాటు చేసింది. శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించే భక్తులు నాన్ ఆల్కహాలిక్ శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు దగ్గరగా విధులు నిర్వహించే సిబ్బందికి పీపీఈ కిట్లు పంపిణీ చేయడంతో పాటు, ప్రతి రెండు గంటలకు ఒకసారి లడ్డూ ప్రసాదాల విక్రయ కౌంటర్లను మార్చేవిధంగా చర్యలు చేపట్టారు. టీటీడీ ఆలయ పరిసరాలు, దర్శన క్యూలైన్లు, లడ్డూ కౌంటర్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో ప్రతి రెండు గంటలకు శానిటైజ్‌ చేస్తున్నారు భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టలో పీపీఈ కిట్లతో క్షురకులు విధులు నిర్వహిస్తున్నారు. భక్తులు భౌతికదూరం పాటించేలా బస్టాండ్ వద్ద ఏర్పాట్లు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. శ్రీవారి ఆలయంలోని ఉప ఆలయాలైన వకుళామాత, యోగ నరసింహస్వామి దర్శనాలను నిలిపివేశారు. తిరుమలలోని దర్శనీయ ప్రదేశాలైన శిలాతోరణం, శ్రీవారి పాదాలు, పాపవినాశనం, జపాలి, ఆకాశగంగకు అనుమతి లేదు.

కాణిపాకంలో రెండో రోజు ట్రయల్ రన్‌
చిత్తూరు:
కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నేడు రెండో రోజు ట్రయల్‌ దర్శనాలు కొనసాగుతున్నాయి. సోమవారం 3100 మంది స్వామివారిని దర్శించుకున్నారు.నేడు ఉద్యోగులు,స్థానికులు, ఉభయ దారులను దర్శనానికి అనుమతించనున్నారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యేవరకు ప్రమాణాలు చేయించడం లేదని, స్వామివారికి నిర్వహించే అర్జిత సేవలకు 30 శాతం భక్తులను అనుమతి ఇస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు