డెరైక్టర్ పదవా... మాకొద్దు బాబోయ్

4 May, 2015 03:14 IST|Sakshi

ఒంగోలు సెంట్రల్: రిమ్స్ డెరైక్టర్ పదవి మాకొద్దంటే... మాకొద్దంటూ దూరం...దూరంగా పారిపోతున్నారు రిమ్స్‌లో పనిచేస్తున్న సీనియర్లు. ఈ నెల 30వ తేదీతో ప్రస్తుత డెరైక్టర్ అంజయ్య పదవీ కాలం ముగిసిపోతోంది. ఈ నేపధ్యంలో గతనెల 20వ తేదీన విలేకర్ల సమావేశాన్ని అంజయ్య ఏర్పాటు చేసి ఈ విషయం ప్రకటించడమే కాకుండా తన పదవి పొడిగించినా సరే కొనసాగే ప్రసక్తే లేదని కరాఖండిగా తేల్చి చెప్పడంతో ఆ బాధ్యతలు ఎవరికివ్వాలనే వేటలో ప్రభుత్వం పడింది. సహజంగా ఈ కుర్చీలో కూర్చోడానికి నేనంటే ననేనంటూ పోటీ పడాల్సిందిపోయి ఎవరికివారు తప్పుకుంటుండడంతో స్వయంగా ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాసరావు జోక్యం చేసుకోవల్సి వచ్చింది.

ప్రస్తుతం తిరుపతి బర్డ్స్ వైద్యశాల నుంచి ఆర్థ్రోపెడిక్ సర్జన్ డాక్టర్ జగదీష్ పేరు తెరపైకి వచ్చింది. అలా పేరు వినిపించిందో లేదో ‘తిరుపతి నుంచి ఒంగోలుకు నేను రాలేనని’ ఉన్నతాధికారులకు ఆయన స్పష్టం చేసినట్లు  సమాచారం. కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న డాక్టర్ సిద్దప్ప గౌర్ పేరును రాష్ట్ర డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ సూచించడంతో తప్పనిసరి పరిస్థితిలో అంగీకరించినట్టు తెలిసింది. అయితే మూడు రోజులుపాటు ఒంగోలులో, మూడు రోజులు కర్నూలులో ఉంటానని మెలిక పెట్టడంతో సంబంధితాధికారులు పునరాలోచనలో పడ్డారు. చివరకు రిమ్స్ అడ్మిన్ డిఎంఇ వెంకటేశ్, గైనకాలజీ విభాగ అధిపతి డాక్టర్ కృష్ణారావు, డాక్టర్ రాజ్ కుమార్‌లలో ఎవరికో ఒకరికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించి ఎట్టోలా కొనసాగిద్దామని తర్జన భర్జన పడుతున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖామంత్రి కామినేని రిమ్స్ సందర్శనకు వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ డెరైక్టర్‌గా ఎవరుండాలనే విషయం హైదరాబాదు వెళ్లి ప్రకటిస్తానని చెప్పడంతో రిమ్స్‌లో ఉత్కంఠ నెలకుంది.

డెరైక్టర్‌కు  ఉండాల్సిన అర్హతలివీ...
రిమ్స్‌కు డెరైక్టర్‌గా ఉండాలంటే అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌గా ఐదు సంవత్సరాలు, అసోసియేట్ ప్రొఫెసర్‌గా నాలుగు సంవత్సరాలు, ప్రొఫెసర్‌గా ఐదు సంవత్సరాలు అనుభవం ఉండాలి.

మరిన్ని వార్తలు