ఘాటెక్కిన ఉల్లి

22 Dec, 2014 01:24 IST|Sakshi
ఘాటెక్కిన ఉల్లి

* కిలో రూ.15 నుంచి రూ.25కు పెరుగుదల
* పెద్దగా మార్పుల్లేని కూరగాయల ధరలు

 తాడేపల్లిగూడెం : ఉల్లి ధర మళ్లీ ఘాటెక్కింది. గత వారంతో పోలిస్తే కిలో రిటైల్‌గా రూ.8 నుంచి రూ.10 వరకు పెరిగింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తాడేపల్లిగూడెం హోల్‌సేల్ మార్కెట్‌లో ఆదివారం మహారాష్ట్ర ఉల్లి క్వింటాల్ రూ. 2,400 పలికింది. నాణ్యత తక్కువగా ఉన్న ఉల్లి అయితే రూ. 1,800 వరకు పలికింది. రిటైల్‌గా నాణ్యతను బట్టి కిలో రూ.20 నుంచి రూ.25 వరకు విక్రయించారు. గత వారం నాణ్యత కలిగిన ఉల్లి క్వింటాల్ రూ.2,000 పలకగా నాణ్యత తక్కువగా ఉన్నవి రూ.1,400 చేసి విక్రయించారు. ఆదివారం కేవలం 15 లారీల సరుకు మాత్రమే గూడెం హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చింది. ఉల్లి ధర ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరయ్యారు.
 
పెరిగిన బీరకాయల ధర
మార్కెట్లో బీర కాయలు ధర ఒక్కసారిగా పెరిగింది. గూడెం హోల్‌సేల్ మార్కెట్‌లో పది కిలోల ధర  రూ.250 పలికింది. గత వారం రూ.110 కావడం గమనార్హం. వంకాయలు తక్కువ ధరకే లభ్యమయ్యాయి. తెల్ల వంకాయలు పది కిలోలు రూ.100 పలకగా రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.15 నుంచి రూ.20 వరకు విక్రయించారు. నల్ల వంకాయలు పది కిలోలు రూ.60 పలికాయి. బెండ, దొండకాయల ధరలు స్వల్పంగా పెరిగాయి. బెండ కాయలు పది కిలోలు రూ.220 పలకగా దొండకాయలు రూ.150 చేసి విక్రయించారు.

చిక్కుళ్లు పది కిలోలు రూ.200 లకు విక్రయించగా, పొట్టి చిక్కుళ్లు పది కిలోలు రూ. 400 చేసి విక్రయించారు. క్యారెట్ పది కిలోలు రూ.180, బీట్ రూట్ రూ.250, క్యాప్సికం, బీన్ రూ.450 పలికాయి. క్యాబేజీ పది కిలోలు రూ.80 నుంచి రూ.100 వరకు పలికాయి. దోసకాయలు కూడా ఇదే ధర పలికాయి. కంద పది కిలోలు రూ.130 వద్ద స్థిరంగా ఉండగా, పెండ్లం రూ.250 చేసి విక్రయించారు. టమోటాలు చిత్తూరు రకం 25 కిలోల ట్రే రూ.250కి చేసి అమ్మగా నాటు రకం రూ.80 పలికాయి. బంగాళా దుంపలు పది కిలోలు రూ.110 చేసి అమ్మకాలు సాగించారు.

మరిన్ని వార్తలు