‘ఉల్లి’ భారం తగ్గిస్తాం: కేంద్ర మంత్రి థామస్

8 Sep, 2013 04:22 IST|Sakshi

న్యూఢిల్లీ: కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలు 15-20 రోజుల్లో దిగొస్తాయని వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉల్లి పంట చేతికి రానుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొత్త పంట త్వరలోనే మార్కెట్‌కు రానుందని కేంద్ర ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రి కె.వి.థామస్ చెప్పారు. ఉల్లిపాయలు, ఇతర అత్యవసర వస్తువుల ధరలు నింగినంటడంపై చర్చ జరగాలని రాజ్యసభలో శనివారం ఎంపీ నరేష్ అగర్వాల్ (ఎస్పీ) డిమాండ్ చేశారు. ఈ మేరకు స్వల్పకాలిక చర్చ చేపట్టారు. మంత్రి థామస్ స్పందిస్తూ, జూలై-అక్టోబర్ మధ్యకాలంలో ఉల్లి ధరలు పెరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. రబీ సీజన్‌లో దేశవ్యాప్తంగా 60 శాతమే ఉల్లి ఉత్పత్తి జరిగిందని చెప్పారు. మిగతాది ఖరీఫ్‌లో చేతికొస్తుందని తెలి పారు. ఉల్లిని దాచిపెట్టి ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారులను అరెస్టు చేసినట్లు చెప్పారు.

>
మరిన్ని వార్తలు