బతుకు భారం

25 Aug, 2015 01:47 IST|Sakshi
విశాఖ కంచరపాలెం రైతుబజార్‌లో ఉల్లి కోసం పాట్లు

ధరల పిడుగుతో సామాన్యుడు సతమతం
నిత్యావసర ధరలు ఘోరం
ఉల్లి ఆల్‌టైం రికారు ్డధర
పట్టించుకోని ప్రభుత్వం

 
ఉల్లిపాయలు, టమాటాలు తదితర కూరగాయలే కాదు.. కందిపప్పు, మినపపప్పు, పెసరపప్పు ధరల్లో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. అంతేనా? బియ్యం, నూనెల రేట్లూ పరుగులు తీస్తున్నాయి. ఇలా ఒకటేమిటి జనం తినడానికి అవసరమైన సరకులన్నీ పోటీ పడుతున్నాయి. సామాన్యుడిపై ధరలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. నిత్యం అవసరాలైన వీటిని కొనలేక, తినకుండా ఉండలేక నానా అగచాట్లు పడుతున్నాడు. బతుకు బండిని భారంగా లాక్కొస్తున్నాడు. ఇంటి బడ్జెట్‌ను సర్దుబాటు చేయలేక గృహిణి ఆవేదన చెందుతోంది. ధరలను నియంత్రించాల్సిన సర్కారు చోద్యం చూస్తోందంటూ ప్రతి ఇంటి ఇల్లాలూ మండిపడుతోంది.
 
విశాఖపట్నం:కొన్నాళ్లుగా అన్ని సరకులూ పెరగడమే తప్ప తగ్గడం లేదు. పప్పులు ధర పెరిగిందని కూరగాయల వైపు మళ్లితే వాటిదీ అదే దారి. కాయగూరలు కొండెక్కాయని చికెన్, మటన్, పప్పుల వైపు వెళ్లినా అవీ అలాగే ఉన్నాయి. వేటికవే ధరల్లో రికార్డులు సృష్టిస్తూ సామాన్యుడిని పిండేస్తున్నాయి. విశాఖ నగరంలోనూ, జిల్లాలోనూ కిలో ఉల్లి రూ.80ల వరకూ పెరిగి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. రైతుబజార్లలో రూ.20లకే  దొరుకుతుందని ఆశగా వెళ్లిన వారికి రోజంతా క్యూలో నిలబడితే అక్కడ అదృష్టవంతులనే ఉల్లి వరిస్తోంది. దీంతో ఉల్లి పేరెత్తితేనే తుళ్లిపడే పరిస్థితి తలెత్తింది. అరకొర ఉల్లితోనే కూర పూర్తవుతోంది. కందిపప్పు కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. కిలో 120కు పెరిగితేనే విలవిల్లాడిన వారికిప్పుడది కిలో రూ.150లకు చేరుకుంది. పెసరపప్పు రూ.140లకు పెరిగింది.

వేరుశనగపలుకుల ధర రూ.100లు పలుకుతోంది. తాజాగా రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు ప్యాకెట్‌కు రూ.4-5లు, 15 కిలోల డబ్బాపై రూ.50ల దాకా పెరిగింది.  బియ్యం ధరలు పక్షం రోజుల నుంచి ఊపందుకున్నాయి. వరి దిగుబడి తగ్గిందన్న కారణంతో క్వింటాలుకు కనిష్టంగా రూ.400లు, 25 కిలోల బ్యాగుపై రూ. 100ల పెరిగాయి. ఇలా ఓ మధ్య తరగతి ఇంట్లో నెలకు సగటున రూ. 2 వేల వరకూ అదనంగా భారం పడుతోంది. నిత్యావసరాలకు ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించడం లేదు. ఎంతలా ఖర్చు తగ్గించుకుందామన్నా వీల్లేని, విధిలేని పరిస్థితుల్లో ప్రతి ఇంట్లోని ఇల్లాలూ అల్లాడిపోతోంది.
 
 అన్ని బారులూ ఉల్లికే
 కంచరపాలెం: కంచరపాలెం సమీపంలో రైతుబజారులో సోమవారం ఉల్లి కోసం బారులు తీరి కనిపించా రు. పిల్లాపాపంతో ఉదయం వేకువ జామునుంచి క్యూలు కడుతున్నారు. అమ్మకాలు ప్రారంభం అయిన గంటలోపే మహిళలు సిగపట్లు ప్రారంభించారు. ఉల్లిపాయాలు అయిపోతున్నాయని వార్తా క్యూలో నిలబడిన మహిళల చెవిలో పడింది. దీంతో తోపులాటలు మొదలయ్యాయి . ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. పలువురు మహిళలు క్యూలో నలిగిపోయారు. దొంగలు సెల్‌ఫోన్‌లు, పరసలు తదితర వస్తువులను కాజేశారు. సబ్సీడీ ఉల్లిపాయలను రైతుబజారులకు కా కుండా చౌకధరల దుకాణాల్లో పంపిణీ చేస్తే బాగుంటుదని మహిళలు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు